Friday, May 3, 2024

బండి సంజయ్‌కి షాకిచ్చిన సొంత నియోజకవర్గ నేతలు

spot_img

ఒంటెద్దు పోకడతో పార్టీని భ్రష్ఠుపట్టించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి మరోసారి కరీంనగర్‌ ఎంపీ సీటు ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అధిష్ఠానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయన మరోసారి ఎంపీగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నాడని, బండికి టికెట్‌ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదంటున్నారు. బండికి వ్యతిరేకంగా గురువారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు సమావేశమయ్యారు. బండి తన ఒంటెద్దు పోకడలతో రాష్ట్రం, జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని, పార్టీలోని సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని సమావేశంలో సదరు నాయకులు మండిపడినట్టు సమాచారం.

అందుకే చాలామంది అసెం బ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, అసెంబ్లీ పోటీ సందర్భంగా కనీస సమాచారం ఇవ్వలేదని వారు మండిపడినట్టు తెలిసింది. ప్రధాని మోదీ పర్యటన సమయంలోనూ తమను ఆహ్వానించలేదని, ఈ తరహా వ్యవహారం వల్లే అనేక మంది సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని పేర్కొన్నట్టు సమాచారం. కరీంనగర్‌ స్థానాన్ని బీజేపీ గెలిచేదని, బండి శైలితోనే ఓడిందని ఆరోపించినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తనకు అనుకూలంగా ఉన్నవారితో లాబీయింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నాడని విమర్శించినట్టు సమాచారం. బీజేపీ సీనియర్‌ నేతలు కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, ఈటల, లక్ష్మణ్‌ వంటి నాయకులపైనా అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని, దీనిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే మున్ముందు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడినట్టు తెలిసిం ది. సమావేశంలో సీనియర్‌ నాయకులు కాశిపేట లింగయ్య, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles