Friday, May 3, 2024

‘ఏమైనా ఉంటే బయట చూసుకోండి’ బీజేపీకి హైకోర్టు హెచ్చరిక

spot_img

బీఆర్‌ఎస్‌తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని స్పష్టంచేసింది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సీ దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ అధినేతపై ఆరోపణలు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకొన్న చీఫ్‌ జస్టిస్‌, రాజకీయ ఆరోపణలు ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని స్పష్టంచేశారు.

ఇది ఇలా ఉండగా.. కేసుకు సంబంధించిన ఫైల్స్‌ ఇవ్వాలని సిట్‌ను ఒత్తిడి చేయరాదని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఫైల్స్‌ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అప్పీళ్లపై తాము విచారణ జరుపుతున్నామని, తదుపరి విచారణ జరిగే ఈ నెల 9వ తేదీ (సోమవారం) వరకు మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఫైల్స్‌ ఇవ్వాలని సిట్‌పై ఒత్తిడి చేయరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

Latest News

More Articles