Saturday, May 18, 2024

డయాలసిస్‌ సేవలు.. దేశానికి తెలంగాణ దిక్సూచి

spot_img

హైదరాబాద్: పేదలకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని, వైద్య సీట్లలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

చౌటుప్పల్‌లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్‌, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సమైక్య పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క డయాలసిస్‌ కేంద్ర కూడా ఉండేది కాదన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు.

డయాలసిస్‌ రోగులకు ఉచితంగా బస్సు పాసులు, ఆసరా పింఛను కూడా అందించడం కేసీఆర్‌ అందించిన వరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మూడు డయాలసిస్‌ కేంద్రాలు నేడు 102కి పెంచామన్నారు. డయాలసిస్ సేవలు అందించేందుకు ఏడాదికి రూ.100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు.  

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ ఇస్తామంటే వారి మాట నమ్మి.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు విలువైన భవనాలు, భూమి ఇచ్చిందన్నారు.

మోదీ సర్కార్ నాలుగేళ్లయినా వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌, తెదేపా పాలనలో వైద్య విద్యకోసం చైనాకో, ఉక్రెయిన్‌కో వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. 33 జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలను ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.

ప్రతి లక్ష మందికి 19 మెడికల్‌ సీట్లు ఉన్న తొలి రాష్ట్రం దేశంలో మనదేనన్నారు. పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న మహనీయుడు కేసీఆర్‌ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, స్థానిక పురపాలిక ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles