Sunday, May 19, 2024

టెన్త్ రిజల్ట్స్ విడుదల: ఫస్ట్ నిర్మల్ జిల్లా.. లాస్ట్ వికారాబాద్

spot_img

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదలచేశారు. మొత్తంగా ఈ సారి 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 84.68 శాతం, బాలికలు 88.53 శాతం ఉన్నారు. బాలుర కంటే బాలిక‌లు 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణ‌త న‌మోదు చేశారు.

ఈ ఏడాది 2,793 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. కాగా.. 25 స్కూళ్లలో జీరో పర్సెంట్ ఉత్తీర్ణత రావడం గమనార్హం. పదో తరగతి ఫలితాలలో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా.. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.25% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీ ఎయిడెడ్ ఆశ్రమ పాఠశాలల్లో 86.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ప్రభుత్వ పరిషత్ పాఠశాలలో 79.14% ఉత్తీర్ణత సాధించారు.

మోడల్ స్కూళ్లలో 91.3% ఉత్తీర్ణత రాగా.. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 94.6% ఉత్తీర్ణత వచ్చింది. జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి 9 స్కూళ్లలో జీరో ఉత్తీర్ణత కాగా.. 915 పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. 13 ప్రైవేట్ పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత కాగా.. 1410 ప్రైవేట్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. ప్ర‌యివేటు విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు చేయ‌గా, బాలురు 43.06 శాతం, బాలిక‌లు 47.73 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

కాగా.. జూలై 14 నుంచి జూలై 22 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్న 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 26 వరకు సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు నిర్ణయంచారు.

ఫలితాల విడుదల కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.

Latest News

More Articles