Sunday, May 19, 2024

ఓటు కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

spot_img

ఓటర్ల జాబితాలో పేరు లేనివారితో పాటు ఈ ఏడాది అక్టోబర్‌ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ అడ్రస్ ను మార్చుకునేందుకూ వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ముసాయిదా ఓటర్ల లిస్టును ఇవాళ(సోమవారం) ప్రకటించనున్నది. ఈ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 26, 27తోపాటు సెప్టెంబర్‌ 3, 4న గ్రామాలు, వార్డుల్లో క్యాంపులను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సెప్టెంబర్‌ 28 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, అక్టోబర్‌ 4న తుది జాబితాను ప్రకటించనున్నది. ఈ జాబితాతోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణను విజయవం తం చేయడంతోపాటు ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుతూ ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు.

ప్రస్తుతం తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, 2,133 మంది ట్రాన్స్‌జెండర్లు, 15,368 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసువారు 4.72 లక్షల మంది, 80 ఏండ్లు పైబడినవారు 4.79 లక్షల మంది, వికలాంగులు 4.98 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు అధికారులు.

Latest News

More Articles