Monday, May 20, 2024

ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

spot_img

ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ(సోమవారం) సంచలన తీర్పు నిచ్చింది. ఇలాంటి కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటు వేయడానికి, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పక్కన పెట్టేసింది.

ఒక‌వేళ లంచం తీసుకున్న‌ట్లు ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే, అప్పుడు వాళ్ల‌ను విచారించ‌వ‌చ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టిక‌ల్ 105, 194ను సాకుగా చూపి వాళ్లు విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. పార్ల‌మెంట్‌లో స‌భ్యులు ఏదైనా మాట్లాడినా లేక ఓటు వేసినా.. అలాంటి కేసుల్లో ఆర్టిక‌ల్ 105(2) ప్ర‌కారం ఎంపీల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. ఆ ఆర్టిక‌ల్ ప్ర‌కారం వాళ్ల‌ను విచారించ‌డం కుద‌ర‌దు. అలాగే ఎమ్మెల్యేల‌కు ఆర్టిక‌ల్ 194(2) ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

గ‌తంలో పీవీ న‌ర్సింహారావు కేసులో జ‌రిగిన విచార‌ణ‌ను విశ్లేషించామ‌ని, ఆ తీర్పుతో తాము ఏకీభ‌వించ‌డం లేద‌ని, ఆ తీర్పును కొట్టివేస్తున్నామ‌ని, ఎంపీల‌కు విచార‌ణ విష‌యంలో ఇమ్యూనిటీ ఇవ్వ‌డం లేద‌ని, న‌ర్సింహారావు కేసులో ఇచ్చిన తీర్పు వ‌ల్ల ప్ర‌మాదం ఉంద‌ని సుప్రీం బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

ఆర్టిక‌ల్స్ 105(2), 194(2) ప్ర‌కారం ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తే , అప్పుడు అది యావ‌త్ స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధం ఉన్న‌ట్లు అవుతుంద‌ని కోర్టు తెలిపింది. పార్ల‌మెంట‌రీ హ‌క్కుల ద్వారా అవినీతిప‌రుల్ని ర‌క్షించ‌డం స‌రైన విధానం కాదు అని కోర్టు చెప్పింది. లంచం దేని గురించి ఇచ్చార‌న్న‌ది కాదు, లంచం ఇవ్వ‌డం, తీసుకోవ‌డం నేర‌మ‌ని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి: ఈ నెల 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు

Latest News

More Articles