Saturday, May 18, 2024

వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు భారీ ఎండలు

spot_img

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను వల్ల గాలిలోని తేమ మొత్తం అటు వైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వారం నుంచి పది రోజుల వరకు ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరేబియాలో ఏర్పడిన తుఫాను బలహీనపడి, పూర్తిగా తొలగిపోతే తప్ప.. రుతుపవనాల కదలికలో వేగం పెరిగే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ 1న రుతుపవనాలు కేరళను తాకడం జరుగుతుందని, రుతుపవనాలు కేరళను తాకిన 10 రోజులకు అనగా.. జూన్‌ 10న తెలంగాణకు రుతుపవనాలు రావడం జరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తెలిపారు. అయితే, ఈసారి రుతుపవనాలు కేరళను 8న తాకడం వల్ల తెలంగాణలో 18న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మధ్యలోనే అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం వల్ల తేమ మొత్తం అటువైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఈ సంవత్సరం జూన్‌ మాసంలో వానలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Latest News

More Articles