Friday, May 17, 2024

‘క్రిస్మస్’ చేసుకున్న కాసేపటికే గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి

spot_img

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుండెపోటుతో ఓ 13 ఏండ్ల బాలుడు మృతిచెందిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జశ్వంత్‌, సుశాంత్‌(13) ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. జశ్వంత్‌ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా, సుశాంత్‌ ముస్తాబాద్‌ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Read Also: గ్రూప్‌-2 మరోసారి వాయిదా!

సోమవారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా సుశాంత్‌ ఆదివారం హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా దవాఖనకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్‌ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్రిస్మస్‌ సంబురాలతో సంతోషం నిండాల్సిన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొన్నది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ కేతిరెడ్డి అరుణ కోరారు.

Latest News

More Articles