Friday, May 17, 2024

గ్రూప్‌-2 మరోసారి వాయిదా!

spot_img

నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 ఎగ్జామ్ మరోసారి వాయిదాపడేలా కనిపిస్తోంది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా చేసిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టంగానే కనిపిస్తున్నది. గ్రూప్‌-2 పరీక్ష మరోసారి రీ షెడ్యూల్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే వివిధ కారణాలతో గ్రూప్‌-2ను రెండుసార్లు రీ షెడ్యూల్‌ చేయగా, మూడోసారి కూడా వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో గ్రూప్‌ -2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌ -2 ఉద్యోగమే కావడంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు.

గ్రూప్‌-2 పరీక్షకు మరో 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కలెక్టర్లతో సమీక్షలు చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, పరీక్షను వాయిదా వేస్తున్నారని మరోవైపు వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 జరుగుతుందా? మూడోసారి మళ్లీ వాయిదా వేస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొన్నది. పరీక్ష దగ్గరపడుతుంటే సీరియస్‌గా ప్రిపరేషన్‌ కొనసాగించాల్సిన సమయంలో ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందో? లేక వాయిదా వేస్తున్నారో? టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also: ఈ సీట్లు పురుషుల కోసం కేటాయించినవి.. వారినే కూర్చోనిద్దాం

మొదట ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నవంబరు 2, 3వ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. నవంబర్‌ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో పరీక్షల నిర్వహణ, శాంతిభద్రతలు, వసతులు, సిబ్బంది అన్నీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నదని కలెక్టర్లు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తెచ్చారు. అన్నీ ఆలోచించిన టీఎస్‌పీఎస్సీ… తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్‌ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్‌పీఎస్సీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్‌కే ఉంటుంది. ఈమేరకు కమిషన్‌ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం.

Latest News

More Articles