Friday, May 17, 2024

అమ్మో టమాట! కిలో రూ.100

spot_img

ప్రతి రోజు కూరల్లో టమాటాలు వాడుతుంటాం. వేసవిలోనూ తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టమటాలు ఇప్పుడు మాత్రం కిలోకు రూ.100 పలుకుతున్నాయి. టమాటాకు తోడు మిర్చి ధర కూడా ఆకాశాన్నింటుతోంది. దాంతో సామాన్యులు మాకు టమాట, మిర్చి కూడా తినే భాగ్యం లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం వరకు హోల్ సేల్ మార్కెట్లలో రూ.30-35 మధ్య పలికిన టమటా రిటైల్ మార్కెట్లో రూ.40-50 మధ్య లభించాయి. ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లలో రూ.65-70 మధ్య లభిస్తున్నాయి. ఇక పచ్చిమిర్చి ధరలు కూడా సెంచరీ దాటాయి. గతంలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య లభించే మిర్చి.. ఇప్పుడు ఏకంగా రూ. 120కి చేరింది.

రుతు పవనాలు ఆలస్యం కావడంతోనే రిటైల్ మార్కెట్లో టమటా ధరలు దాదాపు రెట్టింపయ్యాయని రైతులు, వ్యాపారులు అంటున్నారు. మండు వేసవిలో అంటే గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమటా రూ.2-5 మధ్య పలికింది. కానీ, ఇప్పుడు కిలో టమటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లలో కిలో టమటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థాన్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి.

కాగా.. వర్షాల వల్ల పంట నష్టమే ఈ ధరల పెరుగుదలకు కారణమని రైతులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమటా, మిర్చి పంటలు దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించారని తెలుస్తున్నది. రైతులు కూడా గిట్టుబాట ధర లభించక పోవడంతో టమోటా తోటల్లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం లేదు. ఫలితంగా టమోటా తోటలపై చీడ పీడలు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని మహారాష్ట్రలోని నారాయణ్ గావ్ ప్రాంత రైతు అజయ్ బెల్హెకర్ తెలిపారు.

ఇటీవల వచ్చిన బిపర్ జాయ్ తుపాన్ కూడా టమోటా దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపిందని కొందరు అంటున్నారు. ఈ తుఫాను వల్ల గుజరాత్, మహారాష్ట్రల్లో పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. వర్షాల వల్ల అటు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా తగ్గిపోవడంతో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు రెట్టింపయ్యాయని ఢిల్లీలోని ఆజాద్ పూర్ హోల్ సేల్ మార్కెట్ వ్యాపారి అశోక్ గనోర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయన్నారు.

Latest News

More Articles