Saturday, May 11, 2024

నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరం

spot_img

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులతోపాటు పలువురు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు బీఆర్‌ఎస్‌లో చేరడంతో జోష్‌ నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరినవారికి పార్టీ విధానాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. నాందేడ్‌లోనిర్వహించనున్న ఈ తరగతులకు 1,000 మంది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ రెండు రోజులపాటు నాందేడ్‌లోనే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు
రెండు రోజుల శిక్షణ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీ అనుబంధ సంఘాలను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పార్టీ కమిటీలను ఏర్పాటుచేసి జిల్లాలవారీగా బాధ్యులను నియమించనున్నారు. అనంతరం నెల రోజులపాటు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బూతు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఎక్కడికక్కడ రైతులతో ర్యాలీలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాలీ లేదా పెద్ద సభను నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.

బీఆర్‌ఎస్‌లోకి మాజీ సీఎం బంధువు సచిన్‌ దేశ్‌ముఖ్‌
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేసి జాతీయస్థాయి రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న దివంగత విలాసరావు దేశ్‌ముఖ్‌ బంధువు సచిన్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు మరో 60 మంది ముఖ్య అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మహారాష్ట్రలో ప్రజల్లో పట్టు ఉన్న ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సచిన్‌ దేశ్‌ముఖ్‌ చేరిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో లాతూర్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సచిన్‌ దేశ్‌ముఖ్‌ గట్టి పోటీ ఇచ్చారు.

సచిన్‌ దేశ్‌ముఖ్‌తో పాటు బీఆర్‌ఎస్‌లో చేరినవారిలో రంగనాథ్‌ బోడే, అనిల్‌ బెల్లాలే, మనోహర్‌ బన్సోడే, బాలాజీ బన్సోడే, సద్దాం షేక్‌, రామేశ్వర్‌ హెబలే, సంతోష్‌ బెల్లాలే, రమేశ్‌ గైక్వాడ్‌, భీమా ధుల్పావ్డే, ప్రతాప్‌ లోమాటే, జగన్నాథ్‌ డోక్‌, శరద్‌ పాయలే, కైలాశ్‌ బిష్ణోయ్‌, పవన్‌ బోయనే, మనోజ్‌ జాదవ్‌, వికీషిండే, ఆది సోమవంశీ, అభి చమే, బన్సోడే, రఘునాథ్‌గోర్‌, శివకుమార్‌ చొండే, జబ్బార్‌ పఠాన్‌, షేక్‌ సైఫుల్లా, షేక్‌ అజహరుద్దీన్‌, షేక్‌ మజర్‌, షేక్‌ హిజార్‌, షేక్‌ జియాద్దీన్‌, అజయ్‌ బిరాజ్దర్‌, షేక్‌ సమీముల్లా, పఠాన్‌ జమీర్‌, షేక్‌ ఆఫ్తాబ్‌, షేక్‌ సోహెల్‌, కోతింబిరే సల్మాన్‌, బోర్గావర్‌ సచిన్‌, వాఘే అమోల్‌, షేక్‌ అబ్దుల్‌ భాయ్‌, షేక్‌ జబ్బార్‌, మనోజ్‌ జాదవ్‌, ఆది సోమవంశీ, అభి చామే, బాన్సోడ్‌, భీమా ధుల్పావ్డే, రఘునాథ్‌ గోర్‌, మాధవ్‌ పతంగే, సోమేశ్‌ దేశ్‌ముఖ్‌, శశికాంత్‌ ఇంగోలు, ఎస్వీ చవాన్‌, దినేశ్‌ గట్లేవార్‌, ఆదితయ్‌ సోమవంశీ, విశ్వనాథ్‌ బన్సోడే, అభిజీత్‌ చమే, షేక్‌ అయూబ్‌, అజిత్‌ షాయద్‌ లాయెక్‌, సయ్యద్‌ సోయేశ్‌, షేక్‌ సహబాజ్‌, షేక్‌ అమీర్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాలసుమన్‌, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేత మాణిక్‌ కదం తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles