Friday, May 17, 2024

ధరణికి జైకొట్టిన జనం.. సంక్షేమానికి వేదికగా నిలిచిన మంచిర్యాల

spot_img
  • బంధు, బీమా, ధాన్యం పైసలు దాని పుణ్యమే
  • పైసా లంచం లేదు.. పడిగాపులు అసలే లేవు
  • 24 గంటల కరెంటిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
  • ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశాం
  • సింగరేణిని నాశనం చేసిన కాంగ్రెస్‌, బీజేపీ
  • మంచిర్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

మంచిర్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన విజయవంతమైంది. అక్కడి ప్రజలు సంక్షేమానికి సై అన్నారు. ధరణికి జైకొట్టారు. ధరణి కావాలా? దందా కావాలా?.. అని సీఎం కే చంద్రశేఖర్‌రావు అడుగుతుంటే ధరణి ఉండాల్సిందే.. అంటూ మంచిర్యాల ప్రజానీకం పిడికిలెత్తి నినదించింది.

మూడేండ్ల కష్టం ధరణి

మూడేండ్లు రాత్రి పగలు కష్టపడి ఈ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చానని దాని వెనుక ఉన్న కష్టాన్ని సీఎం ప్రజలకు వివరించారు. దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు ప్రకటించగానే సభ మొత్తం ఈలలు, కేకలతో మార్మోగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ మంచిర్యాల కేంద్రంగా.. చేతివృత్తులకు రూ.లక్ష సాయం, నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, మరో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ధరణితోనే రైతుబంధు సాధ్యమైంది

రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇంటికే పంపిస్తున్నం. హైదరాబాద్‌ నుంచి ఏటా రైతు బంధు ద్వారా రూ.15-16 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేస్తున్న. పెట్టుబడి సాయం పడంగనే రైతుల ఫోన్లు టింగ్‌ టింగ్‌మని మోగుతున్నయ్‌. వడ్లు అమ్మినంక వారం లోపల అకౌంట్లో డబ్బులు పడుతున్నయ్‌. ఇదంతా ధరణి పుణ్యమేనని సీఎం సభలో వివరించారు.

మోదీకి బుద్ధి చెప్పేందుకే బీఆర్ఎస్

దేశంలో 361 బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నయని, వీటితో 150 ఏండ్లు కరెంటు ఇవ్వొచ్చన్నారు. కానీ, దుర్మార్గంగా మోదీ సర్కార్ విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటూ ఖర్చు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నదని నిప్పులు చెరిగారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి దేశవ్యాప్త పోరాటానికి నడుం బిగించినామని సభలో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచిందని సీఎం అన్నారు. తెలంగాణ రాకతో సింగరేణి పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు, శంకుస్థాపనలు

రూ.4,116 – దివ్యాంగులకు పెన్షన్‌ పెంపు

రూ.1,00,000 – చేతి వృత్తిదారులకు చేయూత

రూ.6,000 కోట్లు – 3.38 లక్షల గొర్రెల పంపిణీ

రూ.1,748 కోట్లు – చెన్నూరు, పర్దాన్‌పల్లి లిఫ్ట్‌కు

రూ.164 కోట్లు – గోదావరిపై అంతర్గాం వంతెనకు

రూ. 700 కోట్లు – సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌

మంచిర్యాల జిల్లాలో..

సమీకృత కలెక్టరేట్‌ భవనం ప్రారంభం

జిల్లాలో ఇంటి జాగాకు పట్టాల పంపిణీ మొదలు

మెడికల్‌ కాలేజీ భవనానికి శంకుస్థాపన

మందమర్రి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ

Latest News

More Articles