Sunday, May 19, 2024

ఫేక్‌ నోటిఫికేషన్స్‎తో 50 వేల మందికి టోకరా

spot_img

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కొలువుదీరిన ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల డొల్లతనాన్ని బయట పెట్టిన మోసమిది. కేంద్ర ప్రభుత్వ పథకాలను పోలిన పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించిన మోసగాళ్లు రెండేండ్లుగా దేశవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగార్థులను మోసగించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ ఘరానా మోసాన్ని ఒడిశా పోలీసులు బయటపెట్టారు. బుల్డోజర్‌ న్యాయం, ఎన్‌కౌంటర్లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే యూపీలోని బీజేపీ సర్కారు ఇలాంటి మోసాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

ఒడిశా ఆర్థిక నేరాల విభాగం డీజీ జై నారాయణ్‌ పంకజ్‌ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ సాంకేతిక నిపుణుడు జఫర్‌ అహ్మద్‌(25), అతడి ముగ్గురు సోదరులు ఈ మోసానికి ఒడిగట్టారు. ‘జీవన్‌ స్వాస్థ సురక్ష యోజన’, ‘భారతీయ జనస్వాస్థ సురక్ష యోజన’, ‘గ్రామీణ సమాజ్‌ స్వాస్థ సేవా’ అనే కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లతో పోలికలు ఉండేలా మూడు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి దిన పత్రికల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు.

దరఖాస్తుదారులను నమ్మించడానికి 50 మందితో కాల్‌ సెంటర్లనూ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్లో దరఖాస్తుకు రిజిస్ట్రేషన్‌ రుసుముగా రూ. 3 వేలు, ఉద్యోగ శిక్షణ కోసం రూ.70 వేలు చెల్లించాలని నిబంధన పెట్టారు. రాజస్థాన్‌లో వందలాది నకిలీ బ్యాంక్‌ అకౌంట్లను తెరిచారు. ఆ ఖాతాలకు నిరుద్యోగులు చెల్లించిన డబ్బులను యూపీలోని ప్రభుత్వ జన్‌ సేవా కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేయడం ద్వారా డ్రా చేసుకున్నారు. విత్‌ డ్రా చేసుకున్న నగదుపై జన్‌ సేవా కేంద్రాల నిర్వాహకులకు 10% కమీషన్‌ చెల్లించారు.

ఈ మోసానికి 1000 సిమ్‌లను, 530 మొబైల్‌ ఫోన్లను ఉపయోగించిన కేటుగాళ్లు ఆ తర్వాత వాటిని నదిలో పారేశారు. ఒడిశా పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం గుజరాత్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, ఏపీ, ఒడిశా రాష్ర్టాలకు చెందిన నిరుద్యోగులు మోసపోయారు. ఈ మోసానికి సూత్రధారి అయిన జాఫర్‌ అహ్మద్‌కు కోర్టు 5 రోజుల రిమాండ్‌ విధించింది. నిరుద్యోగులను నిలువునా ముంచి కోట్లాది రూపాయాలు కొల్లగొట్టిన మోసగాళ్లు అలీగఢ్‌లో రూ.కోట్లు విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Latest News

More Articles