Tuesday, May 21, 2024

సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది

spot_img

సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. సిరిసిల్ల జిల్లాను కాపాడుకునేందుకు ఎంతకైనా ఉద్యమం చేద్దామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ(శుక్రవారం) నాడు కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్‌ దగ్గర కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా.. గోదావరి జలాలను కాపాడుకోవాలన్నా.. మన నేత కార్మికుల బతుకులు బాగుండాలన్నా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఈ బాధ పట్టలేక పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్‌ ఏర్పాటు చేశానని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్‌ ఆధ్వర్యంలో అనేక స్కీమ్‌లు పెట్టుకున్నామని తెలిపారు. సిరిసిల్లకు ఒక టెక్స్ టైల్‌ పార్క్‌ కావాలంటే మోడీ ఇవ్వలేదు.. అయినా సరే రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలు, రంజాన్‌ గిఫ్ట్ లు, స్కూల్‌ యూనిఫాం కాంట్రాక్టులు ఇచ్చి కాపాడుకున్నాం. కానీ ఈనాడు వచ్చిన ఈ ప్రభుత్వం  అన్నింటినీ బంద్‌ పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బకాయిలు ఇవ్వక పోగా .. కొత్త ఆర్డర్లు  కూడా ఇస్తలేరని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బతుకమ్మ, రంజాన్‌ తోఫా అందలేదని చెబుతున్నారని అన్నారు. పేదలకు కొత్త బట్టలు అందడంతో పాటు.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని ఈ కార్యక్రమాన్ని పెట్టామని తెలిపారు. అలాంటి ఉన్నతమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో గుడ్డిగా ఓట్లు వేయడం కాదు.. ఎవరో చెబితే ఓట్లు వేయడం కాదు.. మన బతుకేంది.. మన ఆగమేందనేది ఆలోచన చేయాలని సూచించారు కేసీఆర్.

రైతుబంధు ఇవ్వడానికే వెనుకాడిన ఈ ప్రభుత్వం ధాన్యం కూడా కొంటలేదని విమర్శించారు కేసీఆర్. కల్లాల్లో ధాన్యం తడిసిపోతుందన్నారు. వడ్లు తడిసిపోతుంటే కొనే దిక్కులేదని చెప్పారు. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచించి పార్లమెంటులో మనతో కొట్లాడే వ్యక్తి వినోద్‌కుమార్‌కు ఓటేయాలని సూచించారు. వినోద్‌తో పాటు చాలామంది గెలవబోతున్నారని కేసీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో నెంబర్‌వన్‌ మెజారిటీ ఇచ్చి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఇక్కడ వినోద్‌కుమార్‌ గెలవాలని స్పష్టం చేశారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు

Latest News

More Articles