Friday, May 17, 2024

కాంగ్రెస్ పార్టీ మీద లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ కీలక వ్యాఖ్యలు..

spot_img

ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్‌ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్‌ నాయకులతో అగ్రస్థాయిలో నాకు మంచి సంబంధాలున్నాయి. నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ భయానికి గురై.. ఎన్నికల్లో గెలిచేందుకు దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఆవేదనతో చెప్తున్నా.. ఆ పార్టీ అనేక చర్యలు అలానే ఉన్నాయి. ఉదాహరణకు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)పై కేసీఆర్‌గారు పరిశీలించి అటు ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం అయ్యేట్టు చేద్దామన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఓపీఎస్‌ ఇచ్చేస్తామని చెప్పింది. కొన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్‌ను అమలుచేస్తున్నారు. బ్యాలన్స్‌ తీసుకురాకపోతే కచ్చితంగా ఆ రాష్ట్రాలు నాశనమైపోతాయ్‌’ అని వ్యాఖ్యానించారు.

Read Also: సీటు రానందుకు ఖుషి అయితున్న తెలంగాణ బీజేపీ నేతలు

‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటట్లైతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడం కోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశారు. నేడు నిరాశతో ఉన్న వర్గాలకు ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉన్నదని, దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి, ఉపాధి కల్పన జరిగే ఏర్పాట్లు లేకుంటే రాష్ట్ర, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఓ టీవీ చానల్‌లో జేపీతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు తదితర అంశాలపై కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు జేపీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Read Also: ఎన్నికల క్షేత్రంలో భర్తకు పోటీగా భార్య..

తెలంగాణలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని జేపీ కొనియాడారు. ఉద్యమం సందర్భంగా నెలకొన్న అన్ని రకాల సందేహాలు, భయాలను కేసీఆర్‌ పటాపంచలు చేశారని ప్రశంసించారు. కేంద్రంలో ఆర్థిక పరిస్థితి ‘పైన పటారం.. లోన లొటారం’లా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నెలకొన్న సందేహాలు, భయాలపై సమాధానమిస్తూ.. ఉద్యమం సందర్భంగా తనపైనే అధికంగా ఒత్తిడి ఉండేదని జేపీ చెప్పారు. తెలంగాణ పర్యటనలో అంతా ‘జై తెలంగాణ’ అనాలనే డిమాండ్లు వచ్చేవని, ఆంధ్రా ప్రాంతంలో ‘సమైక్యాంధ్ర’ అనాలని ఒత్తిడి తెచ్చేవారని గుర్తుచేశారు. ఆంధ్రా, తెలంగాణ కలిసుంటే మంచిదని, ఒకవేళ విడిపోవాల్సి వస్తే సామరస్యంగా విడిపోవాలనే తాను కోరుకున్నట్టు చెప్పారు. ఉద్యమం సందర్భంగా హైదరాబాద్‌పై అనేక సందేహాలు, భయాలు ఉండేవని, వాటిని పటాపంచలు చేస్తూ అందరినీ సమానంగా ఆదరిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌ కాస్మో పాలిటన్‌ కల్చర్‌ దేశ ఐక్యతకి ప్రతీకగా ఉన్నదని, అందరినీ సమానంగా ఆదరించడం ద్వారా ఈ సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసిందని చెప్పారు. ఇది మనందరికీ గర్వకారణమని, ఎలాంటి భేదభావాలు లేకుండా చేయడం తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడి నాయకత్వం ఘనతేనని కొనియాడారు.

Latest News

More Articles