Saturday, May 18, 2024

విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్‎ను విరామం లేకుండా గెలిపించాలి

spot_img

కాంగ్రెస్‎ను నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కర్ణాటక పరిస్థితి మనకు వద్దే వద్దని మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గం, కొహెడలో ఆయన రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్, మన అభివృద్ధి. కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ఎంతో మంది వచ్చి వెళ్ళారు.. కానీ నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు. అన్ని రంగాల్లో నేడు హుస్నాబాద్ అభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ వల్ల కాళేశ్వరం అయ్యింది, శనిగరం ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఈ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలిశాక ఒకవైపు నేను, మరోవైపు సతీష్ అండగా ఉన్నాం. కరోనా వచ్చిన నాడు ఎవరు రాలేదు, కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ ఉన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో మోసం చేశారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది వాళ్ళ పరిస్థితి. కర్ణాటకలో కరెంట్ కోతలు అని అక్కడి రైతులు బాధపడుతున్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, కరెంట్ కోతలపై పాటలు వచ్చాయి. ఇంత బాగా కరెంట్ ఇస్తుంటే రిస్క్‎లో పడటం ఎందుకు. రేవంత్ రెడ్డి, మూడు గంటల కరెంట్ ఇవ్వాలి, 10 HP మోటార్ పెట్టాలి అంటున్నాడు. హార్స్ పవర్ అంటే కూడా తెలియకుండా రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్‎ను నమ్మితే కైలాసం ఆటలో పాము మింగినట్టే. ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, ఆరు నెలలకు ఒక్కరు మాత్రం సీఎం అవుతారు.

Read also: హైదరాబాద్‌లో మండి బిర్యానీ తిని 43 మందికి అస్వస్థత

పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు. వాళ్ళ దానికంటే మన మేనిఫెస్టో ఎంతో మంచిది. వాళ్లు రూ. 500 గ్యాస్ సిలిండర్ అంటే, మనం రూ. 400 అన్నాం. వాళ్ళు రూ. 2000 మహిళలకు ఇస్తా అంటే, మనం రూ. 3000 సౌభాగ్య లక్ష్మి ద్వారా ఇవ్వబోతున్నాం. పింఛన్లు 4 వేలు అంటే, మనం 5 వేలు ఇవ్వబోతున్నం. రైతు బంధు ద్వారా ఎకరానికి 16 వేలు ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ప్రతి ఎకరాకు కాదు, ప్రతి రైతుకు 16 వేలు ఇస్తాం అంటున్నారు. రైతు బంధును కాపాడాలంటే కారుకు ఓటు వేయాలి. రైతులు బిచ్చగాల్లు అన్నది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆఖరుకు రామక్కపాటను కూడా కాపీ కొట్టింది. అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి హక్కుదారులను చేయబోతున్నాం. అందరికీ రూ. 5 లక్షల జీవిత బీమా ఇవ్వబోతున్నాం. ఎన్నికల్లో గెలవగానే జనవరి నుండి రేషన్ కార్డుపై సోనా మాసూరి సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. ఓసీలో పేదల కోసం నియోజకవర్గాల్లో గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ ముఖం చూపెట్టడం లేదు.

Read also: పేరే కాదు, ఇంటి పేరు కూడా సేమ్ టూ సేమ్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు.. అయోమయంలో ఓటర్లు

కేసీఆర్ అంటే నమ్మకం, ఒక విశ్వాసం. రూపాయిలో 90 పైసల పని చేశాడు కేసీఆర్. అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ అని ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే మిగిలిన వారికి రుణమాఫీ చేస్తాం. లేదంటే మన కొత్త ప్రభుత్వంలో జనవరిలో చేసుకుంటాం. బీజేపీ వాళ్ళు కరెంట్‎కు మీటర్లు అంటే, కాంగ్రెస్ వాళ్ళు మూడు గంటల కరెంట్ అంటున్నారు. విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్‎ను, విరామం లేకుండా గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు ఇస్తాం, ఇచ్చిన వాటిని పెంచుకుంటాం. గీత, చేనేత కార్మికులకు పింఛన్లు రేపు 5 వేలు చేయబోతున్నాం. మూడు ముక్కలు కాదు, మూడు దిక్కుల అభివృద్ధి అయ్యింది హుస్నాబాద్. కాంగ్రెస్ నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టు. కర్ణాటక పరిస్థితి మనకు వద్దే వద్దు.
ఎమ్మెల్యేగా సతీష్‏ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా’ అని మంత్రి హరీశ్ రావు కోరారు.

Read Also: హెలికాప్టర్‎లో వచ్చి షిప్‎ను హైజాక్ చేసిన కేటుగాళ్లు.. వీడియో హల్ చల్

Latest News

More Articles