Saturday, May 18, 2024

పేరే కాదు, ఇంటి పేరు కూడా సేమ్ టూ సేమ్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు.. అయోమయంలో ఓటర్లు

spot_img

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అభ్యర్థులు బ్యాలెట్ పత్రాలను చూపిస్తూ.. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. కాగా.. ఈ సారి ఈవీఎంలలో అభ్యర్థులను వెతికి మరీ ఓటు వేయడం కొంచెం కష్టంగా మారనుంది. ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరున్న వ్యక్తులు స్వతంత్రులుగా ఆయా చోట్ల పోటీ చేయడమే ఇందుకు కారణం. ప్రధాన అభ్యర్థి ఎవరు? స్వతంత్ర అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఓటర్లు అయోమయానికి గురికానున్నారు. ఇలాంటి అభ్యర్థుల విషయంలో పేరు మాత్రమే కాదు, కొంతమంది ఇంటిపేరు కూడా సేమ్ టూ సేమ్ ఉండటం గమనార్హం.

ఒకే పేరున్న అభ్యర్థులు.. ప్రత్యర్థులు

  • ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్‌ పోటీ చేస్తుండగా.. ఏ అజయ్‌, కే అజయ్‌ పేరున్న అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిచిచారు.
  • కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ప్యాట నరేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
  • నారాయణపేటలో ఎస్‌ రాజేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉండగా, కే రాజేందర్‌రెడ్డి ఇండిపెండెంటుగా నిలిచారు.
  • హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా, ఏడీఆర్‌ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) నుంచి టీ సైదిరెడ్డి బరిలో ఉన్నారు.
  • మహబూబ్‌నగర్‌లో మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా ఎం. శ్రీనివాసులుగౌడ్‌ పోటీలో ఉన్నారు.
  • ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి, ఏడీఆర్‌ పార్టీ అభ్యర్థిగా మన్నె లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు.
  • ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషనరెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి, కే కిషన్‌రెడ్డి ఏడీఆర్‌ నుంచి పోటీలో ఉన్నారు.

పేరు, ఇంటి పేరు ఒకటే ఉన్న అభ్యర్థులు

  • మునుగోడులో బీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఏడీఆర్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
  • ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ పక్షాన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, స్వతంత్రులుగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డీ సుధీర్‌రెడ్డి నిలిచారు.
  • మిర్యాలగూడలో బీ లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కాగా, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బీ లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
  • మహేశ్వరంలో బీఆర్‌ఎస్‌ నుంచి పీ సబిత, స్వతంత్ర అభ్యర్థిగా ఎం. సబిత, కాంగ్రెస్‌ నుంచి కే. లక్ష్మారెడ్డి, జనశంఖారావం నుంచి కే. లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
  • దేవరకద్రలో ఏ. వెంకటేశ్వరరెడ్డి ఉండగా, అదే పేరున్న అభ్యర్థి ఇండిపెండెంట్‎గా బరిలో దిగారు.
  • అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజుపై అదే పేరున్న అభ్యర్థి ఏడీఆర్‌ పార్టీ పక్షాన బరిలో నిలిచారు.

Read also: పెళ్లిలో రసగుల్లా కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న బంధువులు

Latest News

More Articles