Sunday, May 19, 2024

సెల్‌ఫోన్‌లో సోల్లు మాట్లాడడానికి సమయం ఉంటుంది కానీ.. యోగా చేయడానికి లేదట

spot_img

ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజూ ఒక్క గంట సమయం కేటాయించి యోగ, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని ఆయన అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ కాదని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ క్రికెట్ స్టేడియంలో వ్యాస మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు యోగాసనాలు వేశారు.

అనంతరం మాట్లాడుతూ.. నిత్య జీవితంలో యోగా భాగమైందని, చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరూ యోగ అలవర్చుకోవాలన్నారు. కొంతమంది రోగాల బారినపడిన తర్వాత ఆరోగ్యం కోసం చేసేది యోగా అని అపోహలో ఉన్నారని చెప్పారు. యోగా అనేది రోజూ సాధన చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా దీర్ఘాయుష్షు లభిస్తుందని మంత్రి హరీశ్‌ అన్నారు. కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని, ఆధునిక ప్రపంచం ఆహార అలవాట్లు కూడా మనుషులను రోగాలపాలు చేస్తున్నాయని తెలిపారు. అన్నింటికీ పరిష్కారం యోగా ఒక్కటేనని వెల్లడించారు. అనవసర విషయాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడడానికి సమయం ఉంటుంది కానీ.. యోగా చేయడానికి ఉండటం లేదన్నారు. చిన్న వయసులోనే ప్రజలు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యోగా అనేది ఒక్క శరీరానికే కాదు మనసుకు కూడా ఆరోగ్యం ఇస్తుంది.

ప్రపంచ దేశాలు మన భారతదేశం నుంచి యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని పొందుతున్నారని చెప్పారు. అన్ని దవాఖానల్లో గర్భిణీలకు, వారికి అనువైన యోగాసనాలు నేర్పిస్తున్నామని, దాని ద్వారా ఆరోగ్యమైన సుఖప్రసవం అవ్వడానికి అవకాశాలున్నాయని అన్నారు. గ్రీన్ కవర్ పెంపకంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.

Latest News

More Articles