Sunday, May 19, 2024

రాయచూరులో ఇయ్యలేనోడు తెలంగాణలో కరెంట్ ఎలా ఇస్తాడు..!

spot_img

మన పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయచూరులో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వలేనోడు ఇక్కడ ఎట్లా ఇస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కర్ణాటకలో ఇవ్వకుండా తెలంగాణలో ఇస్తామంటే అక్కడి ప్రజలు కాంగ్రెస్ వాళ్లను ఊరికే వదిలిపెడతరా అని అన్నారు. వివిధ డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ నాయకులు, యువతను రెచ్చగొడుతూ బిజెపి నాయకులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు… గత 70 ఏళ్లుగా అనేక మంది అన్నదాతలు మృత్యువాత పడితే కనీసం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదని, వ్యవసాయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణాలో రైతు బీమా ద్వారా గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం లాభసాటి అయిందన్నారు.

రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు. కాంగ్రెస్ నాయకుడు మాత్రం రైతులకు 24గంటల కరెంటు దండుగ అని అంటున్నాడని తెలిపారు. కొందరు ప్రతిపక్ష నేతలు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే… తాము 25 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అంటున్నారని, వారి హామీలు అమలు కానివని ఎద్దేవా చేశారు. బిజెపి నాయకులు ఫ్రీ కరెంట్ వద్దు మీటర్ పెడదామంటున్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, బీజేపి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో తెలంగాణలో అమల్లో ఉన్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకం ఒకటైన అమలవుతుందా అని ప్రశ్నించారు.

గతంలో తాగు నీటి కోసం ఒక బోర్ వేసి అందుకు ఓ శిలాఫలకం ఏర్పాటు చేయడం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని, ఒక బోరు కోసం కూడా శిలాఫలకం వేసేలా గత పాలన సాగిందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. గతంలో ప్రతి చిన్న పనికి తాండా వాసులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని.. నేడు దర్జాగా వారి తండాను గ్రామ పంచాయతీ చేసుకుని అన్ని పనులు స్థానికంగానే అయ్యేలా చేశామన్నారు. ముంబై, పుణె వలసలు వెళ్లాల్సిన దుస్థితి లేకుండా అందరూ స్థానికంగానే జీవించేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles