Wednesday, May 22, 2024

జనవరిలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు

spot_img

రైతుబంధు ఆపాలని రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‎కు లేఖ రాశారు.. ఇది న్యాయమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ములుగు నియోజకవర్గ ప్రజలు మంత్రి కేటీఆర్‎కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇది ప్రచార సభలా లేదు.. నాగజ్యోతి గెలిచాక వచ్చిన విజయోత్సవ సభలా ఉంది. ములుగులో వందకు వంద శాతం గెలుస్తున్నం. ఏటూరు నాగారంలో బస్ డిపో, మోడల్ కాలనీలు ఏర్పాటు చేస్తాం.. కమలాపురం బిల్ట్ కర్మాగారం తెరుస్తాం. ములుగులో గాడిదలకు మేత వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా.. ముళ్ల చెట్లకు నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా ? కాంగ్రెస్ వాళ్లకు ఓటేస్తే పనులు అవుతాయా ? డిసెంబర్ 3 తర్వాత నాగజ్యోతి ఎమ్మెల్యే అయిన తర్వాత.. మూడోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత సౌభాగ్య లక్ష్మి ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 3 వేలు ఇస్తాం. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు వచ్చాక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తాం. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడు దేశానికే తెలంగాణ బువ్వ పెడుతున్నది. అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇస్తాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ద్వారా రూ. 5 లక్షలు ఇస్తాం.

Read Also; డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ప్రారంభ వేతనం నెలకు 45 వేలు

నల్ల ధనం ఇస్తామన్న మోడీ.. ఎవరి అకౌంట్లో అయినా రూ. 15 లక్షలు వేశారా? రూ. 4 వందలు ఉన్న సిలిండర్ ధరను రూ. 12 వందలు చేశారు.. అన్ని ధరలను మోడీ పెంచారు. ప్రజలు ప్రియమైన ప్రధాని అనడం లేదు.. పిరమైన ప్రధాని అంటున్నారు. సీఎం కేసీఆర్ రూ. 400 కే సిలిండర్ ఇస్తారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ములుగులో జిల్లా మెడికల్ కాలేజీ ఇచ్చాం. సీతక్క తల్లిదండ్రులకు కూడా పోడు పట్టాలు ఇచ్చాం. ములుగులో తన బిడ్డలాంటి నాగజ్యోతిని గెలిపిస్తే సీఎం కేసిఆర్ స్వయంగా రెండు రోజులు ఇక్కడే ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో ఉండే వాళ్లు కాదు.. నిజంగా ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలి. ఈ నెల 30 నాడు ఆలోచించి ఓటు వేయాలి.

Read Also: పథకాలను ఆపగలరేమో కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరు

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కరెంటు పరిస్థితి ఎలా ఉండేది? అంతక్రియలకు కూడా కరెంటు కావాలంటే బతిమిలాడుకునేవాళ్లం. కాంగ్రెస్ నాయకులకు కరెంటు గురించి మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. రేవంత్ రెడ్డి కరెంట్ కనిపించడం లేదు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ ఒక బస్సు పెడతాం.. ములుగు నియోజకవర్గంలోని ఏ ఊరికైనా వెళ్లి కరెంట్ వైర్లను గట్టిగా పట్టుకుంటే తెలుస్తుంది కరెంటు వస్తుందో లేదో. కాంగ్రెస్ హయాంలో పేలిపోయే మోటార్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి.. అర్ధరాత్రి కరెంటు ఇచ్చేవాళ్ళు. అర్ధరాత్రి కరెంటు ఇస్తే పొలం దగ్గరికి వెళ్లితే పాములు, తెల్లు కరిచేవి. నక్సలైట్లు అని కాల్చి చంపుతారేమోనని భయం ఉండేది. రోజంతా పని చేసి నిద్ర పోదామంటే ఫ్యాన్ తిరిగేదా? రైతు బంధు ఆపాలని రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‎కు లేఖ రాశారు.. ఇది న్యాయమా ? సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా రూ. 73 వేల కోట్లు ఇచ్చారు. గత ప్రభుత్వాలు 75 ఏళ్లలో రైతులకు పైసా అయినా ఇచ్చారా ? రైతుబంధు ఇది 12వ విడత.. కొత్తది కాదు. నోటి కాడికి వచ్చిన బొక్కను లాగేశారు. కాంగ్రెస్‎కు ఓటుతో బుద్ది చెబుదాం. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. రైతుల దగ్గర 10HP మోటార్లు ఎంత మందికి ఉంటాయి? పట్వారీ వ్యవస్థ, భూమేత తెస్తాం అంటున్నారు. రైతులకు దళారీలు కావాలా ?.. ఆ దరిద్రం మళ్లీ నెత్తి మీద పెట్టుకుందామా? కాంగ్రెస్ వాళ్లు ఒక్క ఛాన్స్.. మార్పు అంటున్నారు. మార్పు అంటే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి కావాలా.. రైతు బందు, ధరణి ఎత్తివేసే మార్పు కావాలా? మార్పు కావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే దిక్కుమాలిన వ్యవస్థ. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ. అభివృద్ది, సంక్షేమం కావాలంటే కేసిఆర్ సీఎం కావాలి. ఏటూరు నాగారంలో డిపో ఏర్పాటుకు కాంగ్రెస్‎కు 55 ఏళ్లు సరిపోలేదా? డిసెంబర్ 3 తర్వాత ఏటూరు నాగారంలో డిపో తెస్తాం.. రెవెన్యూ డివిజన్‎గా మారుస్తాం. నాగ జ్యోతిని గెలిపిస్తే మీరు అడిగిన ప్రతి పని చేస్తాం’ అని కేటీఆర్ భరోసానిచ్చారు.

Latest News

More Articles