Friday, May 17, 2024

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది

spot_img

రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై కైట్ ఫెస్టివల్‎ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్ సోసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్‎కు నిర్వహించిన ఆటల పోటీల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీవనభృతి ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సంక్రాంతి పండుగ ఆటోవాలాల జీవితంలో కనుమరుగైంది. ఆటో కార్మికులు నాతో చెప్పుకుంటున్న బాధలు వర్ణనాతీతం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారి బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారు కానీ.. వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని వారు ఊహించలేదు. ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మహిళలకు ఫ్రీ బస్ మంచి కార్యక్రమం. అయితే ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టొద్దు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోకార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కొద్దిరోజులుగా ఆటోకార్మికులు నిసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోకార్మికులను పట్టించుకుని వారికి తగిన న్యాయం చేయాలి.

Read Also: అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్ రైల్వే గుడ్‎న్యూస్..

ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆటో డ్రైవర్స్ నిత్యం బిజీగా ఉంటూ వారు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేరు. ఆటో డ్రైవర్స్ పిల్లల చదువులు, డ్రైవర్ల ఆరోగ్యానికి అండగా ఉంటా’ అని హరీష్ భరోసా ఇచ్చారు.

Latest News

More Articles