Saturday, May 18, 2024

అస్సాంలో టీచర్లకు డ్రెస్ కోడ్..

spot_img

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం ప్రభుత్వం డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు టీ షర్ట్స్‌, జీన్స్‌, లెగ్గింగ్స్‌ వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, వారి వస్త్రధారణ కూడా ఆ మేరకు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల డ్రెస్‌కోడ్‌ను తప్పని సరిగా పాటించాలని విద్యాశాఖ వెల్లడించింది. వారు తమ విధులు నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్‌‎తో ఉండాలని సూచించింది.

కొందరు టీచర్లు తమకు నచ్చిన దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారని, కొన్నిసార్లు అది ఆమోదయోగ్యంగా కనిపించడంలేదని విద్యాశాఖ తెలిపింది. స్కూళ్లో విధులు నిర్వహించే సమయంలో ప్రొఫెషనలిజం కనబడేట్లు డ్రెస్సింగ్‌ ఉండాలని పేర్కొంది. క్యాజువల్స్‌, పార్టీ వేర్‌ దుస్తులకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక నుంచి పురుష ఉపాధ్యాయులు ఫార్మల్‌ షర్ట్‌, ప్యాంట్‌ ధరించాలని; మహిళా ఉపాధ్యాయులు సల్వార్‌ సూట్‌ లేదా చీర వంటి ఫార్మల్‌ దుస్తుల్లో మాత్రమే పాఠశాలకు రావాలని ఆదేశించింది. ఒకవేళ డ్రెస్‌ కోడ్‌ పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

Latest News

More Articles