Friday, May 3, 2024

కరీంనగర్‌ కాంగ్రెస్ కి కష్టమే..!

spot_img

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్‌గా మారింది కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం. ఇక్కడ పోటీ ఈ రెండు పార్టీల మధ్యే అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అయితే బాలేదని విమర్శలు వస్తున్నాయి. అధికారం, అసెంబ్లీల సంఖ్య ఉన్నా కాంగ్రెస్ కి కరీంనగర్ లో గట్టి అభ్యర్థి లేడు. కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లకు గాను నాలుగింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్‌లో సీట్లు ఎప్పుడూ రాలేదు.

పేరుకు అధికార పార్టీయే అయినా.. ఈ పార్లమెంట్‌ స్థానంలో బలమైన అభ్యర్థి లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు దాదాపు ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇది కాస్త ఇబ్బందిగానే మారింది. జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరోవైపు NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్‌రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా ఇటీవల ప్రచారంలోకి వచ్చింది.

ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే నియెజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా.. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో 5 లక్షల 15వేలకు పైగా ఓట్లు సాధించడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా సెకండ్ ప్లేస్‌లో ఉండటం తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉందన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మరోవైపు సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా మోడీ ఛరిష్మాతో ప్రచారం మొదలు పెట్టారు. మొత్తానికి కరీంనగర్‌ పార్లమెంట్‌ బరిలో బండి సంజయ్‌, వినోద్‌కుమార్‌ ప్రత్యర్థులని తేలిపోయినా.. కాంగ్రెస్‌ ఎవరిని బరిలో దింపుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

Latest News

More Articles