Sunday, May 19, 2024

డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్.. ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వ కొత్త నిర్ణయం

spot_img

చాలావరకు రోడ్డు ప్రమాదాలకు నిద్రమత్తే కారణం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా లారీలు ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురవతూ ఉంటాయి. సరుకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతూ ఘోర ప్రమాదాల భారిన పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది.

Read Also: నేడు హైదరాబాద్‌లో క్రిస్మస్‌ వేడుకలు.. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

అందులో భాగంగా హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

Latest News

More Articles