Friday, May 17, 2024

మానవీయ కోణంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహనీయుడు పీవీ

spot_img

హైదరాబాద్: మానవీయ కోణంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహనీయుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని సీనియర్‌ జర్నలిస్ట్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ బారు అన్నారు. హైదరాబాద్‌లో పీవీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో “బిట్వీన్‌ ఇందిరా గాంధీ అండ్‌ నరేంద్రమోదీ… ది ట్రాన్స్‌ఫర్మేటివ్‌ పొలిటికల్‌ ఎకానమీ ఆఫ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ నరసింహారావు” అనే అంశంపై సంజయబారు స్మారక ఉపన్యాసం చేశారు.

1950 నుంచి 1980 వరకు సగటు వార్షిక వృద్ధి రేటు 3.5 శాతం, 1980 నుంచి 2000 వరకు 5.5శాతం ఉంటే… అది 2000 నుంచి 2015 వరకు 7.5శాతానికి పెరగడానికి కారణం… ఆర్థిక సంస్కరణల ఫలితమే అని అన్నారు. 2015 నుంచి 5 నుంచి 6శాతం మధ్యే ఆర్థిక వృద్ధి రేటు నడుస్తోందని, సమీప కాలంలో కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదని అభిప్రాయంవ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణల్లోనూ మిడిల్‌ పాత్‌ విధానం ద్వారా భవిష్యత్‌ లక్ష్యాలకు బాటలు వేశారని చెప్పారు.

విదేశాంగ విధానాల్లోనూ పీవీ తనదైన ముద్ర వేశారని చెప్పారు. సమాఖ్య వ్యవస్థ గొప్పదనాన్ని పరిరక్షిస్తూ… స్వపక్ష, విపక్ష సీఎంలు అనే భేదం లేకుండా అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. పీవీ తర్వాత ప్రధానులుగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ కూడా పీవీ విధానాల్ని అనుసరించారని వివరించారు.

1994లో కశ్మీర్‌పై జెనీవాలో జరిగిన యూఎన్‌ మానవ హక్కుల సమావేశానికి అఫీషియల్‌ డెలిగేట్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రతిపక్షనేత వాజ్‌పేయిని పంపించిన రాజనీతిజ్ఞుడు పీవీ అని సంజయ బారు కొనియాడారు. ఆ ప్రతినిధి బృందంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, కశ్మీర్‌ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ను సభ్యులుగా పంపడం ద్వారా దేశ ఐక్యతను చాటారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదాన్ని పీవీ పరిరక్షించారని చెప్పారు. ఆ పునాదుల్ని కదిలిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. దేశానికి ఎంతో గొప్ప సేవ చేసిన పీవీకి భారత రత్న ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భారతరత్న ఇవ్వకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

విద్యవ్యవస్థ అభివృద్ధితో దేశ భవిష్యత్‌ను పీవీ మార్చారు: లక్ష్మీ నారాయణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకుల, ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాలు దేశానికి గొప్ప మానవ వనరుల్ని అందించాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. సీఎంగా పీవీ రాయలసీమలో కొడిహనహళ్లిలో, తెలంగాణలోని సర్వేల్‌లో, ఆంధ్రాలోని తాడికొండలో గురుకుల పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. అలా.. కొడిహనహళ్లి గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా పీవీ గురించి మాట్లాడే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. పీవీపై సీతాపతి రాసిన ‘హాఫ్‌ లయన్‌’ బుక్‌ చదివానని, ఆ బుక్‌ చదివిన తర్వాత తనకు పీవీ రోరింగ్‌ లయన్‌, కంప్లీట్‌ మ్యాన్‌ అనే విషయం అర్థమైందని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు దేశానికి టర్నింగ్‌ పాయింట్‌ అని అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశానికి రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకుంటున్న దశలో… ఒక్కో సందర్భానికి ఏది కావాలో అది ముందే ఆలోచించిన దార్శనికుడు పీవీ అని లక్ష్మీనారాయణ కొనియాడారు. ఆనాడు పీవీ అభిప్రాయపడినట్టుగా… భారత దేశంలో విద్యాలయాలకు, పరిశోధనశాలలకు మధ్య సమన్వయం మరింతగా పెరగాలని ఆకాంక్షించారు.

ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని పీవీ మార్చారు: రామచంద్రమూర్తి

కాంగ్రెస్‌ విధానాలు సోషలిజానికి అనుకూలంగా ఉండేవని సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి అన్నారు. అటువంటి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా, ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ.. ఆర్థిక సంస్కరణలు చేపట్టడం సాహసోపేతమైన చర్య అని అభిప్రాయం వ్యక్తంచేశారు. పీవీ చేపట్టిన సంస్కరణలు కూడా మానవీయ కోణంలోనే ఉన్నాయని చెప్పారు. సంస్కరణల ఫలితాలు జాతీయ స్థాయిలో అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు.

పీవీ నిరంతర అధ్యయనశీలి: పీవీ ప్రభాకర్‌ రావు

వయసుతో నిమిత్తం లేకుండా 100శాతం కృషి చేయడం, కర్మయోగిగా ఉండటం పీవీ నరసింహారావు నైజమని పీవీ తనయుడు, పీవీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పీవీ ప్రభాకర్‌ రావు అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ వాటికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం ఆయన తత్వమని చెప్పారు. పంజాబ్‌, అసోం, కశ్మీర్‌, కావేరీ వివాదాల పరిష్కారమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. భాషల పట్ల పరిజ్ఞానం నుంచి కంప్యూటర్‌ నైపుణ్యం వరకు నేర్చుకోవడమే జీవన విధానంగా ఆయన సాగారని చెప్పారు. 65ఏళ్ల వయసులో కంప్యూటర్‌ పరిజ్ఞానం, 81 ఏళ్ల వయసులో కీబోర్డు నేర్చుకున్నారని గుర్తుచేశారు. సంప్రదాయ, ఆధునిక సమ్మిళితమైన వ్యక్తి పీవీ అని చెప్పారు.

అటు.. కార్యక్రమంలో భాగంగా పీవీ నరసింహారావు వివిధ రంగాల్లో చేసిన కృషిపై ఆయన తనయుడు పీవీ ప్రభాకర్‌ రావు రాసిన వ్యాస సంకలనం ” మబ్బుల చాటున సూరీడు” పుస్తకాన్ని సంజయబారు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ పత్రికల్లో అచ్చయిన వ్యాసాలతో పాటు మరికొన్నింటిన జోడించి పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో  పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ జర్నలిస్ట్‌ మాశర్మ, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రొఫెసర్‌ కిషన్‌రావు, పీవీ కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు.

Latest News

More Articles