Saturday, May 18, 2024

ట్రాఫిక్‎ను తప్పించుకునేందుకు నదిలో కారు నడిపిన టూరిస్ట్

spot_img

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు జనం బారులు తీరుతున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్‌ జామ్‎ను తప్పించుకునేందుకు ఓ టూరిస్ట్ ఏకంగా నదిలో నుంచి తన వాహనాన్ని పోనిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

వరుస పండుగలు, వారాంతం కావడంతో గత మూడు రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాహౌల్ నుంచి మనాలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కులు, లాహౌల్, స్పితిలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్‌తంగ్‌లోని అటల్‌ సొరంగం గుండా మూడు రోజుల్లో 55,000 కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్‌ సొరంగాన్ని దాటాయి.

మనాలి, కాసోల్‌, సిమ్లా సహా పలు ప్రదేశాల్లోనూ పర్యాటకులు నానా అవస్థలకు గురయ్యారు. సుందరమైన కొండ ప్రాంతాల్లో పండుగ సెలవుల్ని గడుపుదామని వచ్చిన పర్యాటకుల్ని అక్కడి ట్రాఫిక్‌ పరిస్థితి నిరాశపర్చింది. జాతీయ రహదారులపై టోల్‌ బూత్‌ల వద్ద గంటల కొద్దీ వాహనాల్ని నిలపలేక ఇబ్బందిపడ్డారు. ట్రాఫిక్ జామ్‎ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి లాహౌల్ వ్యాలీలోని చంద్రా నదిలో మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అయితే ఆ సమయంలో నదిలో నీరు పెద్దగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ, అతడి వైఖరిపై స్థానికుల నుంచి విమర్శలు రావడంతో.. పోలీసుల సదరు డ్రైవర్‌ని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.

Latest News

More Articles