Saturday, May 18, 2024

తెలంగాణ బీసీ హక్కుల కోసం ‘‘యునైటెడ్ పూలే ఫ్రంట్’’.. కవిత సంచలన నిర్ణయం..!!

spot_img

హైదరాబాద్: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతుంది. పోరాటానికి సంఘీభావంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం బీసీ సంఘాల నాయకులు కలిసి అభినందించారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్(UPF) పేరిట ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు.

బీసీ ఎజెండాపై కదలిక వచ్చింది

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు. ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష స్పందన వస్తోందని, మంత్రులు తమపై విమర్శలు చేస్తున్నారంటే బీసీ ఎజెండాపై కదలిక వస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ తో పాటు సీపీఐ, సీపీఐ ఎంఎల్ వంటి వామపక్ష పార్టీల నుంచి మద్ధతు లభించిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 9 నెలల పాటు అలుపెరగకుండా ఉద్యమించి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును సాధించుకున్నామని వివరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని సాధించిన భారత జాగృతి సంస్థ పూలే విగ్రహం కోసం కూడా పోరాటం చేసి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి రెండో వారంలో మహాధర్నా

కార్యాచరణలో భాగంగా.. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీల మధ్య అన్ని జిల్లాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఫ్రంట్ నాయకులు ప్రకటించారు.

ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో బీసీ నాయకులు వీ ప్రకాశ్, గట్టు రామచందర్ రావు, పల్లె రవికుమార్ గౌడ్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయులు గౌడ్, గెల్లు శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజ్ గౌడ్, విప్లవ్ కుమార్, రాజారాం యాదవ్, సర్దార్ రవీందర్ సింగ్, దావ సురేశ్, మఠం బిక్షపతి భారత జాగృతి నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, పద్మశాలి సంఘం నాయకుడు బొల్ల శివశంకర్ తదితరులు ఉన్నారు.

Also Read.. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. 13మంది జవాన్‌లకు గాయాలు..!

Latest News

More Articles