Friday, May 17, 2024

ఒడిశా రైలు ప్రమాదం.. మానవత్వం చాటిన యువత..!

spot_img

ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో 288 మందికిపైగా మృతి చెందగా.. 1000 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించగా.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా.. చికిత్స పొందుతున్న బాధితుల కోసం యువత మానవీయత చాటుకుంటున్నారు. బాధితులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు వీలుగా ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అంతకుముందు ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యల్లో వందలాది మంది స్థానికులు, యువత పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు.

కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌లోని ఆసుపత్రుల వద్దకు యువత స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ముఖ్యంగా అధిక మంది చికిత్స పొందుతున్న కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసేందుకు తరలివస్తున్నారని వైద్యులు తెలిపారు.

మరోవైపు కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌లో శుక్రవారం రాత్రి నుంచి 3వేల యూనిట్లకుపైగా రక్తం సేకరించినట్లు ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యుడు జయంత్‌ పాండ మీడియాకు తెలిపారు.

Latest News

More Articles