Sunday, May 12, 2024

ముల్లును ముల్లుతోనే తీద్దాం. కాంగ్రెస్ మేనిఫెస్టోనే మనకు ఆయుధం

spot_img

హైదరాబాద్: కార్యకర్తలు కష్టపడి పని చేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడింటికి ఆరు అసెంబ్లీ సీట్లు గెలిపించారని, మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని, మెదక్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలిపించి కేసీఆర్ పేరును కార్యకర్తలు నిలబెట్టారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. సలార్ ఓటిటీ విడుదలపై కొత్త వివాదం..!

‘‘ఈ ఓటమి తాత్కాలికమే ..శాశ్వతం కాదు. గెలిచినప్పుడు పొంగి పోలేదు..ఇపుడు కుంగి పోయేది లేదు. కేసీఆర్ కూడా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు భరించి కూడా కేసీఆర్ నిలబడ్డారు కనుకే తెలంగాణ సాధించారు. ఇపుడు ఈ ఓటమి ని స్వీకరించి మరో గెలుపు కోసం అడుగులు వేద్దాం. పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలు విలువైన సూచనలు చేశారు .వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. కేసీఆర్ పథకాల అమలులో పోటీ పడ్డారు. ఇపుడు కాంగ్రెస్ వాళ్ళు అక్రమ కేసుల బనాయింపుల్లో పోటీ పడుతున్నారు.

Also Read.. ఆ ఒక్క తప్పే గుంటూరు కారంని ముంచేసింది.. తప్పు ఒప్పుకున్న నిర్మాత

పోలీసులను వాడుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను భయ భ్రాంతులను చేస్తున్నారు. అయినా భయపడేది లేదు. పోలీస్ స్టేషన్లు జైళ్లు పోరాటాలు మనకు కొత్త కాదు. ఏ కార్యకర్తకు ఏం జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అండగా ఉంటాం. 39 మంది ఎమ్మెల్యేలం బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటాం. రైతు బంధు విషయంలో కేసీఆర్ కున్న చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదు.

Also Read.. హైదరాబాద్ లో 6 పబ్ లపై కేసులు

బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అనే దుష్ప్రచారాన్ని కార్యకర్తలు గట్టిగా తిప్పి కొట్టాలి. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అయితే గవర్నర్ మేము పంపిన బిల్లులు ఆపేవారా. నామినేటెడ్ ఎమ్మెల్సీ ల పేర్లు పంపితే తిరస్కరించేవారా. కాంగ్రెస్, బీజేపీ లు కుమ్మక్కు అయ్యి రెండు ఎమ్మెల్సీ ల నోటిఫికేషన్ వేర్వేరు గా పోలింగ్ జరిగేట్టు చూశారు. నిజానికి కుమ్మక్కు అయ్యింది కాంగ్రెస్ బీజేపీ లే.

Also Read.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ జడ్జిలకు ఆహ్వానం

అదానీ ప్రధాని ఒక్కటి అని ఆరోపించిన రేవంత్ రెడ్డి అదానీ తో ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నాడు. ఉత్తమ్ దావోస్ పర్యటనలు దండగ అన్నారు. మరి రేవంత్ టూర్ పై ఏమంటారు ? మనం పని నమ్ముకుంటే కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ ను నమ్ముకున్నారు. ప్రభుత్వం పనికొచ్చే రివ్యూలు చేయడం లేదు. సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అంటూ లీకు లు ఇస్తున్నారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో..తర్వాత చెల్లదు. ఆరోగ్య శ్రీ కింద పది లక్షల వైద్య సాయం అన్నారు.అది ఆమలు కావడం లేదు.వాస్తవాలు త్వరలోనే బయటకు తెస్తా. మెదక్ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో బీజేపీకి నాయకత్వం లేదు.

Also Read.. హనుమకొండ జిల్లాలో ఆర్డీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ

ఈ సారి కూడా మెదక్ పార్లమెంటు సీటును భారీ మెజారిటీ తో గెలవాలి. కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తున్నారు. చెత్త పార్టీ నుంచి వెళ్ళిపోతోందని భావిద్దాం. ఆపద సమయంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళే మనోళ్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే మనకు ఆయుధం. ముల్లును ముల్లుతోనే తీద్దాం. ఎవరూ అధైర్య పడొద్దు. భవిష్యత్ లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇకపై సమర్ధంగా తిప్పికొడతాం. కసితో పని చేయాలి. పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు సింహాలై గర్జించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.’’ అని హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles