Friday, May 3, 2024

రైతులను నిండాముంచిన అకాల వర్షాలు..నీటిపాలైన వడ్ల కుప్పలు.!

spot_img

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. డిచ్ పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, మాక్లైర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైతుల కంట కన్నీరు తెప్పించింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలోని చిన్నవాగు నుంచి తండా వరకు సుమార్ 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలం ధర్మోరాలో పిడుగుపడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నందిపేట మండలం ఖుద్వాన్ పూర్ లో మూడు మూగజీవాలు మరణించాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో కురిసిన వర్షానికి వడ్ల రాశులు తడిసిపోయాయి.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానకు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన సుమారు 10వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట నేలరాలింది. కోతకొచ్చిన దశలో మామిడికాయలు నేలరాలాయి. వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండాలో ఇంటిరేకులు లేచిపోయాయి. సుమారు 50వేల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. అదే గ్రామంలో గడ్డివాము, కరెంటు వైరు రోడ్డుపై పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 600క్వింటాళ్ల తూకం వేసిన ధాన్యం, 7,800క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం తడిసిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ కురిసిన వర్షానికి పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్ స్తంభాలు, చెట్టు నేలకొరిగాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ నారాయణపూర్ గ్రామంలో సిరమోని జంగయ్య ఇంటిపై పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. వరి చేలు, మామిడి కాయలు రాలాయి. కొట్టాల రేకులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసింది. సుమారు 60 ఎకరాల్లో ధాన్యంతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.

ఇది కూడా చదవండి: నల్గొండ రోడ్డు ప్రమాదం: సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు

Latest News

More Articles