Saturday, May 4, 2024

అన్నదాతకు అండగా కొప్పుల ఈశ్వర్‌ 36 గంటల రైతు భరోసా దీక్ష

spot_img

పెద్దపల్లి జిల్లాలో అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్‌ నిలబడింది. పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌  36 గంటల రైతు భరోసా దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో దీక్ష ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలల కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టకాలం దాపురించిందన్నారు కొప్పుల ఈశ్వర్. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నష్టపోయిన పంటలకు వెంటనే రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకునేంత వరకు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పరిస్థితుల్లే మళ్లీ వచ్చాయని చెప్పారు. కేసీఆర్‌ రైతుల పక్షపాతిగా పనిచేశారని, రాష్ట్రంలో రైతులను అభివృద్ధి వైపు నడిపిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా మారింది. పుష్కలమైన నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సంబురంగా సాగింది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 100రోజుల పాలనలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా సాగునీటి గోస తీవ్రమవుతున్నది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చే దశలో దెబ్బతిన్నాయి. మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయి. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. స్థానికంగా ఉండే పాలకులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు.

మరోవైపు యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ మొన్నటి వరకు రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకోగా.. ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాన్ని చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు చలించిపోతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసానిస్తున్నారు. ఇటీవల మంథని, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, సుల్తానాబాద్‌, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో దెబ్బతిన్న పొలాలను పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ నిన్న(శుక్రవారం) పరిశీలించారు. రైతులకు మేమున్నామని ధైర్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

Latest News

More Articles