Saturday, May 4, 2024

రక్షణ శాఖ భూముల కోసం 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ కష్టానికి ఫలితం దక్కింది

spot_img

అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. గత ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామమన్నారు.

గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు కేటీఆర్‌. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటంతో ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యం కాకపోవడం, దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో.. ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అందుకే 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని నిరంతర సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు.. తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేశామని, ప్రతి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఇక ఆయా రూట్లలో వచ్చి వెళ్లే ప్రజలకు పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని కేటీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్లనో ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ తో పాటు.. ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయగలిగామని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదాల ధ‌ర‌లు త‌గ్గించ‌లేం

Latest News

More Articles