Sunday, May 19, 2024

కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మితే గోసపడతాం

spot_img

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే గోసపడతామని తెలిపారు మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(శనివారం) కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.

కరెంట్‌ కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని తెలిపారు మంత్రి గంగుల. హైదరాబాద్ రాష్ట్రం సంపదను దోచుకునేందుకు నాటి పాలకులు ధనిక రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర లో కలిపారని, సమైక్య పాలనలో మన బొగ్గును దోచుకుని, గోదావరి జలాలను తరలించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో సాగు నీరు, కరెంట్ లేక అరిగోస పడ్డ రోజులు ఉండేవని గుర్తు చేశారు.

స్వయం పాలనలో సమస్యలు పరిష్కరించామని, కాళేశ్వరం జలాలతో తాగు సాగు నీటిని పరిష్కరించి మండుటెండల్లో చెరువులను మత్తడి దూకిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కరెంట్ కష్టాలు లేకుండా పోయాయని వివరించారు. తెలంగాణ వ్యతిరేకులైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, షర్మిల, కేవీపీ తదితరులు బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో హైదరాబాదులో అడ్డావేశారన్నారు. తెలంగాణలో చిచ్చు పెట్టమని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పంపించారని అన్నారు. వీరంతా కలిసి కేసీఆర్‌ను ఓడించేందుకు గూడుపుఠాని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

Latest News

More Articles