Friday, May 17, 2024

కాంగ్రెస్‌ వచ్చిన 50 రోజుల్లోనే.. తెలంగాణను ఎడారిగా మార్చే నిర్ణయాలు!!

spot_img

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు(కేఆర్ఎంబీ)లో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చవద్దని తాము హెచ్చరిస్తున్నా.. బోర్డులో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో వారు మీడియాతో మాట్లాడారు.

‘‘సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రికి అసలు మన ప్రాజెక్టులపై అవగాహన ఉందా? గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులను కేసీఆర్ చేర్చలేదు. కేసీఆర్‌ హయాంలో కేంద్రానికి అనేక షరతులు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి లొంగిపోయింది. నదీ జలాలపై హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. మొదట్లో కాంగ్రెస్‌ నేతలు సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రకటించారు. ఆ మాట మీద నిలబడలేదు. ఏపీ, కర్ణాటకలకు ఏజెంట్లుగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్‌ తీరుతో త్వరలో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో నీళ్లకైనా కరెంటుకైనా ఢిల్లీపై ఆధారపడే పరిస్థితిని కాంగ్రెస్‌ నేతలు తీసుకొచ్చారు. కేఆర్‌ఎంబీపై పోరాటం చేస్తాం. కేంద్రం దృష్టికి బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ సమస్యలను తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ వచ్చిన 50 రోజుల్లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీకి వెంటనే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి.’’ అని వారు డిమాండ్‌ చేశారు.

Also Read.. దారుణం.. విద్యుత్ షాక్‌తో అన్నను చంపిన తమ్ముడు, మరదలు

Latest News

More Articles