Friday, May 17, 2024

జేబు ఖాళీ చేస్తున్న ప్రయాణం.. రాజమండ్రి టూ హైదరాబాద్ బస్ టికెట్ ధర రూ. 5000

spot_img

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నవారంతా తిరిగి హైదరాబాద్‎కు తిరుగుపయనం అవుతున్నారు. అయితే ప్రయాణికులకు ఆర్టీసీ సమకూర్చిన బస్సులు ఏ మూలకు సరిపోవడంలేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలు భారీగా వసూలు చేస్తుండటంతో హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. నాలుగు రోజులు సరదాగా గడిపిన ఉత్సాహమంతా ఇట్టే ఆవిరవుతోంది. ఏపీలోని రాజమండ్రి, అమలాపురం, కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు అధికంగా ఉండటంతో పెద్ద ఎత్తున టిక్కెట్‌ధరలు పెంచేశారు. నాన్‌ ఏసీ బస్సుల్లో సైతం దాదాపు ఏసీ బస్సుల ఛార్జీలు తీసుకుంటున్నారు. స్లీపర్‌, సిట్టింగ్‌కు వ్యత్యాసం లేదన్నట్లుగా ధరలు ఉన్నాయి.

రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే టికెట్ ధర ఆర్టీసీలో స్లీపర్‎కు రూ. 1245, సిట్టింగ్‎కు రూ. 814 ఉంది. అదే ప్రైవేట్ లో చూస్తే.. స్లీపర్‎కు కనిష్టంగా రూ. 2700, గరిష్టంగా రూ. 5123గా ఉంది. ఇక సిట్టింగ్‎ విషయానికొస్తే రూ. 2518 ఉంది. ఈ ధరలను చూసి సామాన్యులు హడలిపోతున్నారు. ధరల గురించి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను అడిగితే.. బస్సు హైదరాబాద్‎కు ఫుల్‎గా వెళ్లి, రిటర్న్ లో వచ్చేటప్పడు ఖాళీగా రావాల్సి వస్తోందని, అందుకే ఛార్జీలు ఇలా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. పండగ రద్దీ దృష్ట్యా ధరలు ఇలా ఉన్నాయని, మరో రెండు రోజులైతే మామూలు ధరలే ఉంటాయని చెబుతున్నారు.

Read also: ఆఫీసుకు వెళ్తూ బస్సు కిందపడిన యువతి.. అక్కడికక్కడే మృతి

Latest News

More Articles