Saturday, May 4, 2024

రేవంత్‌ ప్రభుత్వం ఒక్క నెలలోనే ఆపేసిన సంక్షేమ పథకాలెన్నో తెలుసా?

spot_img

నెల రోజులు పూర్తి చేసుకున్న రేవంత్‌ సర్కార్‌ రోజుకో రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది. దాంతో ప్రజలు ఏ పథకం ఎప్పుడు ఆగిపోతుందోనని ఆందోళనలో పడ్డారు. తెల్లారితే చాలు ఏ పథకం రద్దు అవుతుందోనని భయంభయంగా బతుకుతున్నారు. ఊహించినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. అధికారం చేపట్టిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కో పథకాన్ని మూలనపడేస్తోంది.

ఎన్నికలవ్వగానే ఎకరానికి రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పారు. ఇప్పటికి నెల దాటింది. దాని సంగతి అతీగతీ లేకుండాపోయింది. ఒక్క రైతుబంధు మాత్రమే కాదు దళితబంధు, గృహలక్ష్మి, న్యూట్రిషన్‌ కిట్‌ పథకాలదీ అదే దారి. ఇప్పుడిక బీసీబంధు బంద్‌ కానున్నది. ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదించిన మెట్రో లైన్‌ అటకెక్కింది. ధరణి డోలాయమానంలో పడింది. ఫార్మాసిటీపై క్లారిటీ లేదు. సీడీఎఫ్‌, ఎస్డీఎఫ్‌ పనులను రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. పాలమూరు-రంగారెడ్డి కాలువల టెండర్లనూ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వరుసలో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం! జిల్లాలు, మండలాలను మళ్లీ పునర్విభజన చేస్తామంటూ ఆదివారం ఓ మీడియా చానల్‌లో రేవంత్‌ చేసిన ప్రకటన కలకలం రేపుతున్నది.

Read Also: మరోసారి జిల్లాల పునర్విభజన యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. నేడు ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే టెండర్ల రద్దు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తమ పరిధిలోని పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరుకావాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందించారు. ప్రస్తుత సీజన్‌లో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల, ఆయకట్టు అంశాలపైన కూడా సీఎం రేవంత్‌ సమీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు. తొలుత ఆయా అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్‌ అధికారులతో అన్ని అంశాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు.

బీసీ బంధుకు రాంరాం..
వెనకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు ముడిసరుకులు, యంత్రపరికరాల కొనుగోలుకు 100 శాతం సబ్సిడీతో రూ.1 లక్ష ఆర్థికసాయం అందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని నిలుపుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీబంధు పథకం కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.1 లక్ష ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసింది. పనిముట్ల కొనుగోలు, లేదంటే ఆధునీకరణ, ముడిసరుకుల కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించింది. అందుకోసం దరఖాస్తులను స్వీకరించగా, 5,28,862 మంది దరఖాస్తు చేసుకొన్నారు.

Latest News

More Articles