Saturday, May 11, 2024

రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

spot_img

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం క్యాబినేట్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం… మహిళలకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దాంతో శనివారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్‌ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఈ పథకం అమలుపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్‌ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఆ రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణం ఏయే క్యాటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనున్నదనే దానిపై అధ్యయనం చేసింది. కర్ణాటకలో ఈ పథకం కోసం ఎంత ఖర్చు అవుతున్నది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తున్నది? వంటి విషయాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ నివేదికను సీఎంకు శుక్రవారం అందజేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2,200 కోట్లు, పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest News

More Articles