Thursday, May 2, 2024

యూరియా కోసం రైతుల క్యూ.. మళ్ళీ తప్పని తిప్పలు

spot_img

పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. పదేండ్లుగా కనిపించని రైతుల బారులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఎదుట సోమవారం భారీ సంఖ్యలో లైన్లలో నిలబడ్డారు. యూరియా కోసం మండలంలోని కల్లూరు, లింబాకే, అంబకంటి, పోలా, సూర్యాపూర్‌, మెదన్‌పూర్‌, అందకూర్‌, కుంటాల గ్రామాలకు చెందిన దాదాపు 300కుపైగా రైతులు వచ్చారు. సోమవారం ఉదయాన్నే వృద్ధులు, మహిళలు పిల్లాపాపలతో వచ్చి, నిలబడే ఓపిక లేకపోవడంతో ఆధార్‌ కార్డులు క్యూలో పెట్టారు. ఉదయం 10 గంటలకు స్టాక్‌ పంపిణీ మొదలు కావడంతో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అందరూ ఒక్కసారిగా ఎగబడడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ మొదలుపెట్టారు. 450 బ్యాగుల స్టాక్‌ మాత్రమే ఉండటంతో యూరియా సరిపోతుందో లేదోనని ఆందోళనకు గురయ్యారు. వరి, మక్కకు యూరియా అధికంగా అవసరం అవుతుండటంతో అన్నదాతలు పరుగులు పెడుతున్నారు. మధ్యాహ్నం వరకు యూరియా పంపిణీ చేశారు.
పదేండ్ల కేసీఆర్‌ సర్కారు హయాంలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, ఇలా ఎప్పుడూ నిలబడ లేదని రైతులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరారు.

Latest News

More Articles