Thursday, May 2, 2024

కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం పక్కా. ఓటు వేసేముందు ఒకటికి 100సార్లు ఆలోచించాలి

spot_img

సిరిసిల్లా: ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్ దాకా..బాసర నుంచి భద్రాచలం దాకా బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన సిరిసిల్లాలో మీడియాతో మాట్లాడారు. ముచ్చటగా మూడోసారి గెలుపు తథ్యమన్న కేటీఆర్, కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కొత్త రికార్డులు నెలకొల్పడం..కొత్త చరిత్ర సృష్టించడం కేసీఆర్‌కు కొత్తకాదని, ప్రజల ఆశీర్వాదం..అభిమానంతో సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి సీఎంగా  అరుదైన ఘనత సాధించబోతున్నారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే మాయా మశ్చీంద్రగాళ్ల ఫేక్ న్యూస్‌లను..ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. తెగించి పోరాడి..తెచ్చుకున్న తెలంగాణను మంది పాలు చేయవద్దు. దశాబ్దాల కష్టాలు.. కన్నీళ్లు.. బాధలు .. వేదనలను దూరం చేశాం. నీళ్లు..నిధులు..నియామకాలు ఉద్యమ నినాదాన్ని..ఒక విధానంగా మార్చి ఆశలను..ఆకాంక్షలను  నెరవేర్చుకున్నాం. అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ సోయితో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని  ఇటుక ఇటుక  పేర్చి..పునర్ నిర్మాణం చేసుకున్నాం. సంపద పెంచి..సకల జనులకు పంచి తక్కువ అప్పులు..ఎక్కువ ఆదాయం వుండే ఒక  సంక్షేమ రాజ్యాన్ని…సరికొత్త నమూనాని దేశం ముందు వుంచామన్నారు.

అప్పుడు ఎట్లుండె తెలంగాణ..ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ

టీఆర్‌ఎస్..బీఆర్‌ఎస్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. 14 ఏండ్లు పేగులు తెగేదాకా కొట్లాడి.. అవమానాలు.. అవహేళనలు..వేయి దాడులు..లక్ష కుట్రలను ఎదుర్కొని..ఆఖరికి చావునోట్లో తలబెట్టి ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. అప్పుడు ఎట్లుండె తెలంగాణ..ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ. గుండెమీద చేయివేసుకోని ఆలోచన చేయాలి. తెలంగాణ దుఖానికి సింబల్‌గా వున్న ప్రతి చిత్రం మారిందా లేదా చూడాలి. పడావుబడ్డ భూములు..పాడుబడ్డ ఇండ్లు ఆకలికేకలు..ఆత్మహత్యలు..వలసలు.. కరువులు..కర్ఫ్యూలు..ఎన్‌కౌంటర్లు.. కరెంట్ కోతలు..కటిక చీకట్లతో అల్లాడిన..తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడెట్లుందో ఇమ్మర్సగా విచారణ చేయాలని కోరారు.

పక్కరాష్ట్రాల కూలీలు వచ్చి ..మనపొలాల్లో నాట్లు వేస్తున్నరా లేదా?

పాలమూరు వలసలు  వలపోతలు ఆగిపోయినయా లేదా..పక్కరాష్ట్రాల కూలీలు వచ్చి ..మనపొలాల్లో నాట్లు వేస్తున్నరా లేదా..? నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ దిగిపోయిందా లేదా..? విషంనీళ్ల పీడ విరగడై..స్వచ్ఛమైన భగీరథ జలాలతో గొంతులు తడుస్తున్నాయా లేదా..? అని ప్రశ్నించారు. నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లలు…ఉరిసిల్లలుగా మారిన  విషాదం ఆగిందా లేదా..? చేనేత కార్మికుడికి చేతినిండా పనిదొరికి..మగ్గానికి మంచిరోజులు వచ్చినయా రాలేదా..?  దొంగరాత్రి మోటర్లు పెట్టబోయి పాములు కుట్టి..షాకులు కొట్ట రైతన్నలు సచ్చిపోయిన పాడు రోజులు పోయినయా లేదా..? 24 గంటల కరెంట్‌తో బోరుబావుల కింద రెండు పంటలు పండుతున్నది నిజమా కాదా..? ఎండిపోయి తాంబాలాలైన చెరువులు నిండుకుండల్లా..గంగాళ్లాగా మారి మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నయా లేదా..? కాళేశ్వరం..పాలమూరు ఎత్తిపోతల పథకాలతో గోదావరి కృష్ణా జలాలు మన పొలాల్లో గలగలా పారుతున్నది నిజమా..కాదా..? నెర్రెలు బారిన నేలలు..పచ్చని పంటలతో సస్యశ్యామలం కాలేదా..?  నీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్లదూరం నడిచిన కష్టాలు తీరినయా లేదా..? నట్టింటికి గంగమ్మ నడిచిరాలేదా..? ఇంటింటకి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే కాదా..?

లక్షా 60వేల ఉద్యోగాలు నింపింది సత్యమా….కాదా?

అన్నమో రామచంద్రా అని అలమటించిన తెలంగాణ దేశానికే అన్నంగిన్నెలాగా మారింది నిజమా…కాదా…? పుట్టెడు దుఖంలో మునిగిన రైతు ఇయ్యాల పుట్లకొద్ది ధాన్యం పండిస్తున్నడా లేదా..? మన రైతన్నలు పంజాబ్‌నే తలదన్నేలా పంటలు తీస్తున్నది వాస్తవమా..కాదా..? రైత పరపతి పెరగలేదా..? భూమి విలువ పెరగలేదా..? మన కొలువులు మనకే దక్కాలన్న నియామకాల నినాదం నిజం కాలేదా..?  95 శాతం లోకల్ రిజర్వేషన్ తో కొత్త జోనల్ సిస్టం వచ్చింది అబద్ధమా..? 2.32 లక్షల నోటిఫికేషన్లు ఇచ్చి..లక్షా 60వేల ఉద్యోగాలు నింపింది సత్యమా….కాదా..? దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మనదా కాదా..?  1022 గురుకుల పాఠశాలలు..కాలేజీలు పెట్టి..పేదపిల్లలకు  కార్పొరేట్ స్థాయి చదువులు చెబుతున్నది వాస్తవమా..? కాదా..? జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టి..బడుగు బలహీన వర్గాల పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నది అబద్ధమా..? ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరునే దాటి..హైదరాబాద్  నెంబర్ వన్ కాలేదా..? దేశంలో వచ్చే కొత్త టెక్నాలజీ జాబుల్లో 44శాతం ఇక్కడే  కల్పిస్తున్నది వాస్తవమా..కాదా..? గూగుల్..యాపిల్..అమెజాన్..ఫాక్స్‌కాన్ గ్లోబల్ కంపెనీలన్న హైదరాబాద్ కు తరలిరాలేదా..? హైదరాబాద్ న్యూయార్క్‌ను మించేలా తయారైందని అందరూ ప్రశంసిస్తున్నది అబద్ధమా..? బీడి కార్మికులకు..ఒంటరి మహిళలకు బోదకాలు బాధితులకు..డయాలసిస్ పేషంట్లకు పెన్షన్లు ..ఇవ్వాలన్న ఆలోచన చరిత్రలో ఎవడికైనా వచ్చిందా…? కంటి పరీక్షలు చేసి..కళ్లద్దాలు ఇవ్వాలన్న మానవీయ ఆలోచన ఎవరైనా చేసారా..?  కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడండి చూసిందే నమ్మాలన, చెప్పింది నమ్మవద్దని కోరారు.

అచ్చమైన..ఆదర్శప్రాయమైన అభివృద్ధి మోడల్‌ మాది

కులం కుంపట్లు రగిలించలేదు, మత మంటలు పెట్టలేదు, ప్రాంతాల పంచాయతీ పెట్టలేదు, అచ్చమైన..ఆదర్శప్రాయమైన అభివృద్ధి మోడల్‌ మాది. ఎవ్వరి మీదా వివక్షలేదు..ఎవ్వరి పట్లా కక్షలేదు. ఏ వర్గాన్ని విస్మరించలేదు..ఏ ఒక్కరిని చిన్నచూపు చూడలేదు. తెలంగాణలో ఎక్కడ ఏ వాగు ఎక్కడుందో.. ఏ వంక..ఏ డొంక ఎక్కడుందో సమగ్రంగా..సంపూర్ణంగా తెలిసిన నాయకుడు కేసీఆర్. దమ్ము..ధైర్య..తెగువ..సాహసం…పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసే లీడర్ వుండటం వల్లే  అసాధ్యాలు సుసాధ్యాలు అయ్యాయి. ఒక రైతుబంధు..ఒక దళితబంధు, కరెంట్ వెలుగు..కంటి వెలుగు, కాళేశ్వరం..యాదాద్రి.. మిషన్ భగరీథ..కాకతీయ.. అంబరాన్ని తాకే అంబేద్కర్ విగ్రహం.. సమున్నత సచివాలయ సౌధం, ఎన్నో..అద్భుతాలు ఆవిష్కృతం ఐనాయని తెలిపారు.

వాళ్ల సీటుకే గ్యారెంటీ లేదు.. వాళ్లిచ్చే గ్యారెంటీలకు దిక్కుంటదా?

మన మీద పోటీ చేస్తున్నవాళ్లు ఎవరు…? వాళ్ల చరిత్ర ఏందో..వాళ్ల గోత్రాలు ఏందో మనకు తెలియవా..? కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు. మనం..చెత్త బుట్టలో విసిరేసిన పార్టీ. తెలంగాణను 50 ఏండ్లు ఏడిపించిన పార్టీ. రాచి రంపాన పెట్టిన పార్టీ..రక్తం తాగిన పార్టీ. కాల్చి చంపిన పార్టీ..కన్నీళ్లు మిగిలించిన పార్టీ. కాంగ్రెస్ చేతులు తెలంగాణ బిడ్డల నెత్తురుతో తడిచాయి. నీళ్లు ఇవ్వలేని..కరెంట్ ఇవ్వలేని..కొలువులు ఇవ్వలేని అసమర్థుల చేతిలో నలిగి నలిగి నాశనమై ఏడ్చి మొత్తుకోని..పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం కదా. ఆ పార్టీకి ఒక  లీడర్ లేడు.. సీఎం స్థాయి నాయకుడే లేడు. వాళ్లకు పాలించే సత్తా లేదు..సమర్థతలేదు..తెలివిలేదు. ఆర్నెల్లకో ముఖ్యమంత్రితో కుర్చీలాట..కుమ్ములాట తప్పదు. స్థిరమైన ప్రభుత్వం …బలమైన నాయకుడు లేకపోతే తెలంగాణ తెర్లైపోతది. ఒక నిర్ణయాన్ని తీసుకోని అమలు చేసే స్ట్రాంగ్ లీడర్ లేకుండే. ఒక పథకం రాదు..పాలసీ రాదు..ప్రాజెక్టులు వుండవ్ నీళ్లు వుండవ్. కరెంట్ వుండదు…కంపెనీలు వుండవ్. వాళ్ల మొసలి కన్నీళ్లను నమ్మితే మనకు కన్నీళ్లే మిగులుతాయి. వాళ్ల సీటుకే గ్యారెంటీ లేదు.. వాళ్లిచ్చే గ్యారెంటీలకు దిక్కుంటదా..? అని ప్రశ్నించారు.

నూటికి 90 పనులు చేసినవాళ్లం..ఆ పది పనులు చేయలేమా?

3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోండి. కౌలు రైతుకు పైసలిస్తే..అసలు రైతుకు ఇవ్వం. ధరణి పోర్టల్ ఎత్తేస్తం..అని  ఓపెన్‌గా చెబుతున్నారు..! తెలిసి తెలిసి బొందలో పడదామా ఆలోచించండి. నమ్మించి నట్టేట ముంచే రకం వాళ్లు ఆదమరిస్తే..ఆగమైతం..! మోసపోతే..గోసపడతాం. కష్టపడి నిర్మించుకున్న.. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు ఐతది. కర్ణాటక డబ్బు సంచులతో ఓట్ల వేట చేస్తున్నవాళ్లు, ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరు. సాధించింది చాలా వుంది. సాధించాల్సిది ఇంకా వుంది. అంతా..ఐపోయిందని చెప్పట్లేదు. పొరపాట్లు జరగలేదని అనట్లేదు. మేమూ మనుషులమే…దేవుళ్లం కాదు. కొంత అసంతృప్తులు..కొన్ని అలకలు.. వున్న మాట వాస్తవమే. సరిదిద్దుకుంటాం..వచ్చేసారి అన్నీ పూర్తి చేసుకుంటాం. నూటికి 90 పనులు చేసినవాళ్లం..ఆ పది పనులు చేయలేమా…? మాకంటే మెరుగైన వాళ్లు, మాకంటే మంచిగా పనిచేసేవాళ్లు ఎవరున్నారో..ఆలోచించాలి. మా కంటే ఎక్కువగా తెలంగాణను ఎవ్వరూ ప్రేమించలేరు. మాకున్న ఆపేక్ష..ఆత్మీయత ఇంకే పార్టీకి వుండదు. మనది పేగుబంధం. విడదీయరాని అనుబంధం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. ఇటుపక్క..సర్వ సమర్థుడు..దమ్మున్నవాడు.. దార్శనికుడు ..మొనగాడు కేసీఆర్ సీఎం అభ్యర్థిగా వున్నాడు. అటు ఎవరు వున్నారు. జోకర్లు..బ్రోకర్లు…బఫూన్లు..మోసగాళ్లు వున్నారు. ఇది రాష్ట్రానికి ఎవరు సీఎంగా వుండాలో ఏ పార్టీ స్టేట్ ను నడిపించాలో తేల్చే ఎన్నిక. కేవలం..ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎలక్షన్ కాదు. తెలంగాణలో వున్న ఏకైక గొంతుక కేసీఆర్‌. ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 70 ఏండ్ల ఎన్నికల చరిత్రలో తెలంగాణ ఎన్నో పార్టీలను గెలిపించింది. కానీ..తెలంగాణను గెలిపించిన పార్టీ మాత్రం బీఆర్‌ఎస్ ఒక్కటే. కాంగ్రెస్..బీజేపీ తెలంగాణలో గెలవాలని చూస్తున్నయ్. మేం తెలంగాణను మళ్లా గెలిపించాలని చూస్తున్నాం. ఓటు వేసేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. మీ ఇంట్లో ఆడపిల్లను..ఒక అయ్యచేతిలో పెట్టేముందు ఎంత విచారణ చేస్తారో అట్లాగే ఆలోచన చేసి ఓటు వేయాలని కేటీఆర్ రాష్ట్ర ఓటర్లను కోరారు.

Latest News

More Articles