Thursday, May 2, 2024

ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు బాధితులు.. పిల్లల కోసం ఇలా చేయండి..

spot_img

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో ప్రతి ఇంట్లో దగ్గు, జలుబుతో బాధపడేవారు ఖచ్చితంగా ఉంటున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా బాధితులు ఉంటున్నారు. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది. మరోవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో.. వచ్చింది సాధారణ జలుబేనా? కాదా? అనే అనుమానం చాలామందిలో మెదులుతున్నది. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి సాధారణమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలతో దవాఖానలకు వస్తున్నవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా.. సీజనల్‌ జ్వరాల మాదిరిగా లేదని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు నిలోఫర్‌ దవాఖానలో రెండు నెలల కిందట జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఇన్‌పేషంట్లుగా చేరే పిల్లల సంఖ్య రోజూ 300-400 వరకు ఉండేదని, ఇప్పుడు 80-100 మధ్య నమోదవుతున్నదని సూపరింటెండెంట్‌ ఉషారాణి తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also; బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం

పిల్లల కోసం సూచనలు
1. ఐదేండ్లలోపు వయసున్న పిల్లల్లో జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా రావొచ్చు. రెండుమూడు రోజులకు మించి జ్వరం ఉంటే దవాఖానకు తీసుకెళ్లాలి.
2. జలుబు, దగ్గు తగ్గడానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అతిగా దగ్గు, జలుబు మందులు వాడొద్దు. పిల్లలకు యాంటిబయాటిక్స్‌ ఎక్కువగా వాడొద్దు.
3. కొందరు పిల్లలు రాత్రుళ్లు ఎక్కువగా దగ్గుతుండటం సాధారణమే. వైరస్‌ కారణంగా వారి ముక్కులో ఉత్పత్తి అయ్యే తెమడ.. రాత్రి పడుకున్న సమయంలో గొంతు వరకు చేరి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దగ్గు ఎక్కువగా వస్తుంది. భుజాలు, తల కింద ఎత్తుగా ఉండేలా దిండు పెడితే ఉపశమనం కలుగుతుంది.
4. నెబ్యులైజర్లు కచ్చితంగా వైద్యుడి సలహా మేరకే వినియోగించాలి. ఆస్తమా ఉన్న పిల్లలకు ఇష్టానుసారం నెబ్యులైజర్లు వాడితే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.
జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న పిల్లలను బడికి, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లకపోవడం మంచిది.
5. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు ఎక్కువగా నీళ్లు, ద్రవాహారం ఇవ్వాలి. ‘వాటర్‌ ఈజ్‌ బెస్ట్‌ కాఫ్‌ సిరఫ్‌’.. అంటే దగ్గుకు నీళ్లను మించిన ఔషధం లేదని వైద్యులు చెబుతున్నారు.

Latest News

More Articles