Friday, May 3, 2024

మీ ఓటు ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. చెన్నమనేనిని అందుకే మార్చాం

spot_img

వేములవాడ: మన దగ్గర ఎన్నికలు రాగానే ఆగమాగమైతరని, అట్ల ఆగం కాకుండా, చెప్పుడు మాటలు నమ్మకుండా సొంతంగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. మీ ఓటు వేములవాడ నియోజకవర్గ ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తదన్నారు. రాజరాజేశ్వర స్వామి కొలువై ఆలయంలోనే తన వివాహం జరిగిందని గుర్తుచేశారు.

‘ఇక్కడ నిజాయితీ పరుడైన చెన్నమనేని రమేశ్‌ ఎమ్మెల్యేగా ఉండెనని, కోర్టులో దిక్కుమాలిన కేసుతో ఇబ్బంది పడ్డాడు. ఆయనను అంతకన్నా ఉన్నత పదవిలో పెట్టుకుందామని చల్మెడ లక్ష్మినరసింహారావుగారిని ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని,  15 ఏండ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు వివరించారు.

కాంగ్రెస్‌ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది. దాంతో 58 ఏండ్లు మనం పడరాని పాట్లు పడ్డామని, ఆఖరికి జగమొండిగా పోరాటం చేసి 33 పార్టీల మద్దతు సాధించి, ఆమరణ దీక్షకు కూసుంటే, సమ్మెలు చేస్తే కేంద్రం దిగొచ్చి రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన్నాడు చెట్టుకొగలం, గుట్టకొగలం ఉన్నం. తర్వాత ఏం జేస్తే తెలంగాణ సమాజం బాగుపడతదని బాగా ఆలోచించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జమానాలో రూ.200 ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 చేసుకున్నామని, ఆ తర్వాత దాన్ని రూ.2 వేలు చేసుకున్నట్లు తెలిపారు. ఈసారి గెలిచినంక రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పెండ్లి కోసం రూ.లక్ష ఇస్తున్నామని, ఆడబిడ్డల ప్రసవానికి సర్కారు దవాఖానకు వెళ్తే ఇదివరకు నానా బాధలు ఉండెనని, ఇప్పుడు ఆ బాధలు పోయినట్లు, ప్రభుత్వ దవాఖానల్లో సౌలతులను మెరుగు చేసామని, దాంతో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినట్లు సీఎం పేర్కొన్నారు.

Latest News

More Articles