Thursday, May 2, 2024

సంతానం లేని వారికి గరుడ ప్రసాదం.. 30 కి.మీ వరకు నిలిచిపోయిన వాహనాలు

spot_img

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గరుడ ప్రసాద పంపిణీపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో సుమారు 30 కి.మీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహదీపట్నం, నానల్‌ నగర్‌, లంగర్‌హౌస్‌, సన్‌సిటీ, అప్పా జంక్షన్‌ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్‌ రింగ్‌ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో  ఇవాళ(శుక్రవారం) ఉదయం 5 గంటల నుంచే హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి బయల్దేరారు. కార్లు, ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

వేకువజాము నుంచి ఉదయం 10.30 గంటల వరకు 60వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చారని మెయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంకా వస్తూనే ఉన్నారని చెప్పారు. ఆలయం దగ్గర గరుడ ప్రసాదం ఉదయం కొంత సమయం ఇచ్చారని.. ఆ తర్వాత ఆపేశారన్నారు. దేవస్థానం నిర్వాహకులు తెలిపిన మేరకు అంచనా వేసి బందోబస్తు ఏర్పాటు చేశామని.. 5 వేల మంది వరకు వచ్చే అవకాశముందని తమకు చెప్పారన్నారు. ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని కోరారు. ప్రత్యమ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా తెలిపారు.

ఇది కూడా చదవండి: మీరు గోకర్ణాన్ని సందర్శిస్తే, ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి.!

Latest News

More Articles