Thursday, May 2, 2024

ఈవీఎం హ్యాకింగ్‌ సాధ్యమే..!

spot_img

హైదరాబాద్‌: మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ మొదలైంది. కాగా,ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయడం సాధ్యమేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను కాదని బ్యాలట్‌ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్‌ వ్యవహారమే కారణమని ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులు చెప్తున్నారు.

ఈవీఎంలలో ఉండే చిప్‌లను మార్చడం పెద్ద కష్టమైన పనికాదని, ఈవీఎంలను తయారు చేయడం దగ్గర నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేవరకూ ఏ క్షణమైనా, ఎలాగైనా ట్యాంపరింగ్‌ చేయవచ్చని చెబుతున్నారు. ఈవీఎం చిప్‌లో ఉండే సోర్స్‌ కోడ్‌ను మార్చడం ద్వారా ఈవీఎంలో ఫలితాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు.

ఈవీఎంలలోని చిప్‌ను తొలగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ చిప్‌ లోలోపలే కాలిపోతుందని ఈసీ అధికారులు చెబుతుండగా..  చిప్‌లోకి కొత్త ప్రోగ్రామ్‌ను ఇంజెక్ట్‌ చేస్తే అన్న దానిపై ఈసీ వివరణ ఇవ్వట్లేదు. ఈవీఎంలను 2004లో మొదటిసారి వినియోగించారు. ఈవీఎంల సగటు జీవిత కాలం 15 ఏండ్లు మాత్రమే. అంటే ఈ లెక్కన 2004లో వినియోగించిన ఈవీఎంలను 2019లో తప్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఈసీ దగ్గర 6.5 లక్షల ఈవీఎం/వీవీప్యాట్స్‌లలో లోపాలున్నట్టేగా.

హైదరాబాద్‌కు చెందిన ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణుడు హరిప్రసాద్‌, అమెరికాకు చెందిన సైబర్‌ నిపుణుడు అలెక్స్‌, నెదర్లాండ్స్‌కు చెందిన మరో నిపుణుడు రోప్‌తో కలిసి 2009లో ఓ ఈవీఎంపై ప్రయోగాలు చేశారు. ఈవీఎంను ఎలా ట్యాంపరింగ్‌ చేయవచ్చో ఓ వీడియోను తీసి తమ వెబ్‌సైట్‌లో పెట్టడంతో వీటి భద్రతపై చర్చ మొదలైంది. కాగా, ట్యాంపరింగ్‌ విషయాన్ని పక్కనబెట్టిన అధికారులు.. ఈవీఎం ఎలా వచ్చిదంటూ ప్రసాద్‌ను అరెస్టు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

2017లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈవీఎంలో ఏ మీట నొక్కినా.. వచ్చిన స్లిప్పులన్నీ బీజేపీ గుర్తువే కావడం కలకలం సృష్టించింది. మే 2017లో ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయవచ్చని చేసి చూపించారు.

31 దేశాలు ఈవీఎంలను వినియోగించాయి. కానీ వీటిలో దాదాపు 30 దేశాలు ఈవీఎంల వాడకానికి స్వస్తి పలికాయి. హ్యాకింగ్‌, ట్యాంపరింగ్‌, విశ్వసనీయత సమస్యలే దీనికి కారణంగా ఆయా దేశాలు చెప్పాయి. ఇదిలా ఉండగా.. 2009 కంటే ముందు బీజేపీ ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించింది. ‘కెన్‌ వుయ్‌ ట్రస్ట్‌ అవర్‌ ఈవీఎం’ పేరిట బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు ఓ పుస్తకాన్నే రాయడం గమనార్హం.

Latest News

More Articles