Thursday, May 2, 2024

ఓటుకు నోటు కేసులో కాళ్లు పట్టుకుంటే బాబును వదిలేశారు

spot_img

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి అని సినీనటుడు, ఏపీ ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, మానవతావాది అని, ఆయనను వదులుకోవద్దని, మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పోసాని మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ మంచికి మంచి, చెడుకు చెడు ఉంటారు. భోళాశంకరుడు, వెరీ హానెస్ట్‌’ అని ప్రశంసించారు. తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. కేసీఆర్‌ శరీరం సహకరించకపోయినా ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అది ఆయన కమిట్మెంట్‌’ అని పేర్కొన్నారు.

Read Also: 50 కోట్ల మంది కస్టమర్లతో ఫోన్‌పే మరో రికార్డు

నాడు కేసీఆర్‌కు ఏదైనా అయితే తెలంగాణలో ఒక్కో వ్యక్తి ఒక్కో అగ్నిగోళం అవుతాడని కాంగ్రెస్‌, బీజేపీకి భయం పట్టుకున్నదని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాయని చెప్పారు. అందుకే కేసీఆర్‌కు రాష్ట్రం తెచ్చిన ఘనత దక్కిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా మేధావులని, అయితే దానికి నాయకత్వం వహించే సమర్థత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని అన్నారు. అందుకే కేసీఆర్‌ను తాను ‘తెలంగాణ గాంధీ’గా అభివర్ణిస్తానని వివరించారు.

పవన్‌కల్యాణ్‌ నువ్వు చూపిస్తే నేను కేసీఆర్‌ను నిలదీస్తా
‘ఆంధ్రా కొడుకులు దోచేశారు అంటూ తెలంగాణ నుంచి తిట్టి, తన్ని తరిమేశారు’ అని పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా తప్పుబట్టారు. తాను 1984 నుంచి తెలంగాణలో ఉంటున్నానని, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా తననుగానీ, తన కుటుంబాన్ని గానీ బెదిరించలేదని చెప్పారు. తెలంగాణ బిడ్డలు తన్ని వెళ్లగొట్టిన ఒక్క కుటుంబాన్ని పవన్‌కల్యాణ్‌ చూపించినా తాను సీఎం కేసీఆర్‌ను నిలదీస్తానని సవాల్‌ చేశారు. ‘మీ ఇంటిమీదగానీ, మీ అన్న ఇంటిమీదగానీ రాళ్లు వేశారా?’ అని ప్రశ్నించారు.

Read Also: నేడు మూడుచోట్ల సీఎం కేసీఆర్ బహిరంగసభలు

మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఇతర రాష్ట్రాల ప్రజలను వెంటబడి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేశారు. అక్కడి లీడర్‌ తన సైనికులను ఆపలేకపోయారని, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ ఒక్క ఆంధ్రా వ్యక్తికి కూడా ఇలాంటి అవమానం జరగలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక తండ్రి మాదిరిగా గొంతెత్తి మాత్రమే గట్టిగా మాట్లాడారని, కర్ర ఎత్తలేదని చెప్పారు. ‘మా రాష్ట్రం మాకు ఇవ్వండి. మీరు కూడా ఉండండి, అందరినీ సమానంగా బిడ్డల్లాగా చూసుకుంటాం’ అని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. అందుకే నాకు కేసీఆర్‌ అంటే ఇష్టం అని వివరించారు. స్వార్థ రాజకీయాల కోసం, నాలుగు ఓట్ల కోసం రెండు రాష్రాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించవద్దని పవన్‌కు సూచించారు.

చంద్రబాబు కన్నా కేసీఆర్‌ తెలివి వందరెట్లు ఎక్కువ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబుకు కండ్లు మండాయని పోసాని పేర్కొన్నారు. తనకన్నా చిన్నవాడు సీఎం కావడం ఓర్వలేక కోట్ల రూపాయలు ఆశజూపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని, రేవంత్‌రెడ్డిని బకరా చేశారని విమర్శించారు. కేసీఆర్‌కు చంద్రబాబు కన్నా వంద రెట్లు తెలివి ఎక్కువగా ఉన్నదని, ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని చెప్పారు. ఆ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కొందరు కేసీఆర్‌ కాళ్లు పట్టుకుంటే వదిలేశారని, అందుకే చంద్రబాబు తెలంగాణను వదిలిపెట్టి పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, కేసీఆర్‌ను చంపితే తెలంగాణలో సీఎం అవుతానని భావిస్తే ఆ పని కూడా చేస్తారని ఆరోపించారు.

Latest News

More Articles