Thursday, May 2, 2024

కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా.. ప్రబల ఆర్థికశక్తిగా తెలంగాణ

spot_img

హైదరాబాద్‌: కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా.. తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తూ.. దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.37,391 కోట్లుగా ఉన్న పన్ను రాబడి.. 2022-23 కు రూ.1,26,617 కోట్లకు చేరుకుంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ద్వారా రూ.1,06,900 కోట్లు వస్తాయని అంచనా వేయగా..  రూ.1,09,991 కోట్ల రాబడిని రాష్ట్ర ఆర్థికశాఖ సాధించింది. 2022-23లో రూ.1,26,606 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. రూ.1,26,617 కోట్ల రాబడి వచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు సమర్పించిన నివేదికలో వివరించింది.

గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా.. అందులో 31 శాతం (రూ.13,087 కోట్లు) మాత్రమే కేంద్రం వచ్చింది. మరోవైపు మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ 2022-23లో గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కింద రూ.15,982 కోట్లు వస్తుందని ఆశించగా.. కేంద్రం రూ.23,131 కోట్లు ఇవ్వడం గమనార్హం.

తెలంగాణ వృద్ధిని ఓర్వని మోదీ సర్కారు అడుగడుగునా అడ్డుపడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా ప్రకటించిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని రూ.39 వేల కోట్లకు కుదించింది. తెలంగాణకు రావాల్సిన రూ.21 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా ఆపేసింది. దీంతో రెండేళ్లుగా తెలంగాణకు రావాల్సిన దాదాపు రూ.40 వేల కోట్లు మోదీ వివక్ష వల్ల నిలిచిపోయాయి. అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించిఉంటే.. మన రాష్ట్రం మరెన్నో అద్భుతాలు సృష్టించేదో.

Latest News

More Articles