Thursday, May 9, 2024

మహారాష్ట్రలో మతచిచ్చుకు బీజేపీ కుట్ర..!

spot_img

హైదరాబాద్: మహారాష్ట్రలో ప్రజల మధ్య మత చిచ్చు పెట్టేందుకు అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నాసిక్‌లో త్రయంబకేశ్వర్‌ ఆలయం వద్ద స్థానికులతో కలిసి ముస్లింలు దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ ఆచారంపై తాజాగా బీజేపీ ప్రభుత్వం వివాదం లేవనెత్తింది.

దీనికితోడు ముస్లింలు బలవంతంగా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆలయ అధికారులతో ఫిర్యాదు చేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆ ఘటనపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సిట్‌ దర్యాప్తునకు ఆదేశించడం వివాదాన్ని మరింత పెంచింది. దీనికితోడు సకల్‌ హిందూ సమాజ్‌కు చెందిన కార్యకర్తలు ఆలయ శుద్ధి పేరుతో ప్రాంగణంలో గోమూత్రం చల్లడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.

వివాదం ఇది

త్రయంబకేశ్వర్‌ ఆలయం సమీపంలోని దర్గా వార్షిక ఉత్సవాల సమయంలో.. ఆలయ ద్వారం వద్ద నుంచి దూపం వేయడం సంప్రదాయంగా వస్తున్నదని, తమకు కూడా శివుడి పట్ల విశ్వాసం ఉన్నదని ఉరుసు నిర్వాహకుడు మతీన్‌ సయ్యద్‌ పేర్కొన్నారు. ఇదే సంప్రదాయంలో భాగంగా ప్రవేశ ద్వారం వద్దకు కొంత మంది ముస్లింలు దూపం పెట్టేందుకు శనివారం రాగా.. ఆలయ సిబ్బంది అడ్డుకొని వెనక్కు పంపించారని పేర్కొన్నారు. అనంతరం తమపై ఫిర్యాదు చేయడంపై మహారాష్ట్ర ముస్లిం నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమని, స్థానిక హిందువులు కూడా దీనిని ఎన్నడూ అడ్డుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఆలయంలో గతంలో జరిగిన ఈ సంప్రదాయానికి సంబంధించిన వీడియోలను కొందరు నెటిజన్లు షేర్ చేస్తూ.. బీజేపీ నేతల తీరును ఎండగడుతున్నారు.

Latest News

More Articles