Wednesday, May 1, 2024

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..

spot_img

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసమని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణను సాధించామన్నారు. చేవెళ్లలో ఇవాళ(శనివారం) నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని.. అనేక మందిని కాపాడుకున్నామని చెప్పారు. ఇవాళ అవన్నీ తన కండ్ల ముందే పోతుంటే.. రైతులు గోస పడుతుంటే.. పంటలు కొనకపోతుంటే.. బోనస్‌ దక్కకపోతుంటే చూసి బాధగలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకుని కూర్చోనని స్పష్టం చేశారు. వందకు వంద శాతం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల కోసం.. ప్రజల ప్రయోజనాల కోసం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల ప్రజల హక్కులు కాపాడేందుకు మీ వెంటే ఉంటదని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీల రంజిత్‌ రెడ్డికి ఏం తక్కువ చేసినం అని కేసీఆర్‌ అన్నారు. ఎంపీ టికెట్‌ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? అని సెటైర్‌ వేశారు. ఆయన ఎందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లిండు.. అధికారం కోసమా? పదవుల కోసమా? పైరవీల కోసమా? సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇలాంటి వ్యక్తులకు ధీటైన దెబ్బ కొట్టాలని ప్రజలకు సూచించారు.

ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్‌ కావాలన్నారు కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అని ఆయన తెలిపారు. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, బలహీనవర్గాల వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి మీ పనులు చేయించాలంటే తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్‌ గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ‘ లేదంటే.. ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు చెప్పినం.. అన్ని పంగనామాలు పెట్టినం.. ఏ పాలసీ సరిగ్గా లేదు.. ఉన్నది కూడా ఊడగొడుతున్నాం. కరెంటు సక్కగా ఇస్తలేం.. రైతుబంధు కూడా సక్కగా ఇయ్యలే.. పంటలు కొంటలే.. 500 బోనస్‌ ఇస్తలేం అయినా మాకే ఓటేసిండ్రు. మేం ఏం చేయకున్నా ఏమీ అనరు అనే అభిప్రాయం వస్తది. తస్మాత్‌ జాగ్రత్త.’ అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం మీకిచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే.. ప్రభుత్వానికి మీరు ఒక సురుకు పెడితేనే మీ అన్ని పనులు అయితాయని అన్నారు. ‘ లేదంటే.. మేం ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధపు వాగ్దానాలు చేసినా మళ్లీ మమ్మల్ని గెలిపించిండ్రు అని అంటరు. ఎల్లెలకల పంటరు.. మీకేం చేయరు.’ అని చెప్పారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలని.. అంకుశంలా పనిచేయాలన్నారు. అప్పుడే ప్రజల కార్యక్రమాలు నెరవేరతాయని అన్నారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: అంబేద్క‌ర్ పుణ్య‌మా అని తెలంగాణ సాధించుకున్నాం

Latest News

More Articles