Saturday, April 27, 2024

రైతు బంధు ఎందుకు వేస్తలేరు?

spot_img

కరీంనగర్: రైతుల బతుకులను ఆగం చేస్తోందంటూ.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని, 28వ తేదీ వచ్చినా ఇంకా ఎందుకు వేయలేదని సుంకే రవి శంకర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతు బంధు కోసం రూ.7700 కోట్ల నిధులను జమ చేసి ఉంచిందని, ఇప్పుడు ఆ డబ్బంతా ఎటుపోయిందని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ ప్రశ్నించారు. పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందిపడుతున్నారని, పంట అదును తప్పిపోతే ఇప్పటి దాకా పెట్టిన ఖర్చు కూడా వృథా అయ్యి వారి బతుకులు ఆగమైతాయని అన్నారు.

ప్రజలను, రైతులను మోసం చేస్తేనే నమ్ముతారని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే నిజం చేస్తున్నారని సుంకే రవి శంకర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులంతా రూ.2 లక్షల చొప్పున లోన్ తెచ్చుకోవాలని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని చెప్పారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.2 వేల పెన్షన్ కే ఇంకా దిక్కులేదని, ఇక రూ.4 వేల పెన్షన్ ఎలా ఇస్తారని అడిగారు. నిబంధనల పేరుతో కాంగ్రెస్ తన ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టే కుట్రలు చేస్తోందని, హామీల అమలులో విఫలమైతే ప్రజల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Latest News

More Articles