Sunday, April 28, 2024

తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే

spot_img

బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‎లో జరుగుతున్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Read Also: ఎడ్ల బండి నడిపిన జడేజా.. వైరల్ వీడియో

‘2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు.. మూడింట ఒక వంతు సీట్లు గెలిచాం. జుక్కల్‎లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదు. కేవలం 1100 ఓట్లతో ఓడిపోయారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‎లో గెలిచారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయి. నిజాంసాగర్ మండలంలో దళితబంధు మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా సమాజం తయారైంది. ‘బంధు’పథకాల ప్రభావం మనపై పడింది. కొత్త ఒక వింత.. పాత ఒక రోతలా ప్రజలు భావించారు. కాంగ్రెస్‎కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదు. గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయి. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‎కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో మన విజయానికి బాటలు వేస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‎లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోంది. మనం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును మనం కచ్చితంగా గెలుస్తాం. పార్టీ అన్నపుడు ఎత్తులు-పల్లాలు తప్పవు. 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచాం. కేవలం ఆరు నెలల్లోనే కేసీఆర్ దీక్షతో అప్పుడు పరిస్థితి మారింది. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగింది. 1985-89 మధ్య ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో ఓడిపోయిన టీడీపీ.. ఆ తర్వాత మొదటి విడతలో జరిగిన 21 ఎంపీ సీట్ల ఎన్నికల్లో 19 గెలిచింది. మొన్న కాంగ్రెస్‎కు ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పునారాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రభుత్వం మీద విమర్శల విషయంలో మనం తొందరపడటం లేదు. మనం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి, అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలు మనల్ని విమర్శిస్తే వదిలి పెట్టే ప్రసక్తి లేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News

More Articles