Sunday, April 28, 2024

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. కాగా.. ఎన్నికలు దగ్గపడుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద విధులలో ఉండే పోలీసులు.. ఆ కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాకుండా ఉండేలా, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా.. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు చేయాల్సిన పనులు, చేయకూడని పనులతో రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులు ఒక జాబితా రూపొందించి వారికి అందచేయాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న సంబంధిత అధికారులు అందరూ కచ్చితంగా ఆ జాబితాను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు తీయడంపై అన్ని వీడియో నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాలి.
మొబైల్ ఫోన్లతో కాకుండా కచ్చితంగా కెమెరాలతోనే చిత్రీకరించాలి.
ఓటర్ల జాబితాకు సంబంధించి, పెండింగ్లో ఉన్న అన్ని 6వ నంబరు ఫారాలను నవంబర్ 10లోగా పరిష్కరించాలి.
ప్రతి జిల్లాలో ఓటర్ల జాబితాపై వచ్చిన అన్ని ఫిర్యాదులను ఫిర్యాదుదారు ఫోన్ నంబర్‏తో సహా నమోదు చేయాలి.
పరిశీలకులు ఈ రిజిస్టర్లను పరిశీలించి, కొందరు ఫిర్యాదుదారులను సంప్రదించి పరిష్కారాలను ధృవీకరించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు తమ మొబైల్ ఫోన్లలో సి- విజిల్ యాప్‎ను డౌన్లోడ్ చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు నిర్ధారించుకోవాలి.
సి-విజిల్ యాప్‎కు రాష్ట్రస్థాయి వార్తాపత్రికలలో (ఇంగ్లీష్ మరియు స్థానిక భాషలలో) ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి.
పోలింగ్ కేంద్రాల బయట వీడియోగ్రఫీ అవసరమని భావించే ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేయాలి.
ఈ కెమెరాల ఫుటేజీని పోలీసు కంట్రోల్ రూమ్‎లతో అనుసంధానం చేయాలి.
పోలింగ్ రోజున మీడియా ఛానళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
ఏదైనా ప్రతికూల వార్త ప్రసారమయితే నోడల్ అధికారి వెంటనే వాస్తవ వివరాలను తెలుసుకోవడంతోపాటూ, వాటిని తిరిగి సంబంధిత ఛానళ్లకు తెలియచేసి వాస్తవ సమాచారం ప్రసారం అయ్యేటట్లు చూడాలి.

Latest News

More Articles